Revanth Reddy : "ఆట"లు సాగవు.. పుష్పా.. రేవంత్ వార్నింగ్

సంధ్య థియేటర్ ఘటనపై శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు

Update: 2024-12-21 11:36 GMT

పుష్ప సినిమా లో తగ్గేదేలా అంటూ హీరో చెప్పిన డైలాగ్ పాపులర్ అయింది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇక పెంచేదేలా? అంటూ పేల్చిన డైలాగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సంధ్య థియేటర్ ఘటనపై శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. సంధ్య థియేటర్ లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకే దారి ఉండటంతో సెలెబ్రిటీ వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు అనుమతి ఇవ్వలేదన్నారు.అనుమతి ఇవ్వకపోయినా పుష్ప సినిమా హీరో థియేటర్ కు వెళ్లారని రేవంత్ రెడ్డి అన్నారు. అతను కేవలం థియేటర్ కు వెళ్లి సినిమా చూసి వెళ్ళిపోతే అభ్యంతరం ఉండేది కాదని, కానీ థియేటర్ కు వెళ్ళేటప్పుడు రోడ్డుపై కారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటూ వెళ్లారని రేవంత్ రెడ్డి తెలిపారు.

పక్క థియేటర్ నుంచి...
దీంతో పక్కన ఉన్న అన్ని థియేటర్ల నుంచి ఒక్కసారిగా పబ్లిక్ సంధ్య థియేటర్ వైపు రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనలో తల్లి రేవతి చనిపోయిందని, ఆమె కొడుకు కోమాలోకి వెళ్ళాడని, అంత తొక్కిసలాటలో కూడా ఆ తల్లి కొడుకు చేయి విడిచిపెట్టలేదని, బిడ్డపై తల్లి ప్రేమ అలాంటిదని రేవంత్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. కొడుకు చేయి పట్టుకుని ఆ తల్లి చనిపోయిందని, హీరో థియేటర్ లోపల ఉండటం వల్ల లోపల కూడా తొక్కిసలాట జరిగిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని హీరోకు ఏసీపీ చెప్పినా... శాంతి భద్రతలు చేయి దాటే ప్రమాదం ఉందని చెప్పినా హీరో వినలేదని అల్లు అర్జున్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
రోడ్ షో చేయడంతో...
బయటకు వెళ్లడానికి హీరో ఒప్పుకోలేదని సిటీ కమిషనర్ చెప్పారని, దీంతో డీసీపీ వెళ్లి అక్కడ నుంచి కదలకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించి హీరోను కారు ఎక్కించారని, అయినా వెళ్ళేటప్పుడు కూడా కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేస్తూ వెళ్లారని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో హీరోపై , యాజమాన్యం పై పోలీసులు కేసు పెట్టారని, బాధ్యత రహితంగా సమాధానాలు ఇవ్వడం వల్లే పోలీసులు వారి విధి నిర్వహించారని చెప్పారు. ఈ ఘటనపై కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికత్వం ప్రదర్శించాయన్న రేవంత్ రెడ్డి తన కొడుకు ఆ హీరో అభిమాని అని కొడుకు కోసం ఒక్కో టికెట్ రూ.3వేల చొప్పున రూ.12వేలు పెట్టి ఆ కుటుంబం సినిమా టికెట్లు కొన్నారని తెలిపారు. థియేటర్ లో ఒక తల్లి చనిపోతే ఆ కుటుంబాన్ని, ఆ బాలుడిని ఒక్క హీరో పరామర్శించలేదన్నారు.
మానవత్వం లేకుండా....
అలాంటి మానవత్వం లేని వాళ్ళను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తే పదేళ్లు మంత్రులుగా పని చేసిన వాళ్లు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని పరోక్షంగా కేటీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరణానికి కారణమైన వారిని పోలీస్ స్టేషన్ కు పిలిస్తే... తప్పు పట్టి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఎంతో నీచమైన భాష వాడారన్నారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని భావించి తమ ప్రభుత్వం ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చిందని, ప్రాణాలు బలి తీసుకుంటే వాళ్లను ఏమీ అనొద్దు అంటే ఇదేం న్యాయమని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగానికి లోబడే మా ప్రభుత్వం నడుచుకుంటోందని, జైలుకు వెళ్లి వచ్చిన హీరో ఇంటికి క్యూ కట్టిన సినీ ప్రముఖుల్లో.. బాధిత కుటుంబాన్ని ఒక్కరైనా కలిసారా? అని ప్రశ్నించారు. సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం కోరుకుంటున్నరో తెలియడం లేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యాపారాలు చేసుకోండి...
వ్యాపారాలు చేసుకోవచ్చు కానీ ప్రాణాలతో చెలగాటమాడటానికి తమ ప్రభుత్వం ఒప్పుకోదన్న రేవంత్ రెడ్డి తాము అధికారంలో ఉన్నంత కాలం అలాంటి ఆటలు సాగవని హెచ్చరించారు. మొత్తం మీద పుష్ప సినిమా టాలీవుడ్ కు కష్టాలు తెచ్చిపెట్టిందనే చెప్పాలి. ఇకపై తాను బెనిఫిట్ షోలకు, ధరలను పెంచేందుకు అనుమతి ఇవ్వబోనని ప్రకటించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఇలాగే ఉంటుందని తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకూ టిక్కెట్ల ధరలను పెంచనివ్వనని తెలిపారు. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట విషయంపై రేవంత్ రెడ్డి అసెంబ్లీ మాట్లాడారు. ఆరోజు అల్లు అర్జున్ అనుమతి లేకుండా రావడం వల్లనే ఒక పేద మహిళ ప్రాణాలు కోల్పోయిందన్నారు.


Tags:    

Similar News