BJP : నేడు బీజేపీ శాసనసభ పక్ష నేత ఎన్నిక
భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేత ఎన్నిక నేడు జరగనుంది
BJP: భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేత ఎన్నిక నేడు జరగనుంది. కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి నేతృత్వంలో జరగనున్న సమావేశంలో శాసనసభ పక్ష నేతను ఎన్నుకోనున్నారు. ఫలితాలు వచ్చి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకూ బీజేపీ శాసనసభ పక్ష నేత ఎన్నిక జరగలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తెలంగాణ శాసనసభలో బీజేపీ తరుపున అడుగు పెట్టారు. దీంతో ఎవరిని శాసనసభ పక్ష నేతగా ఎంపిక చేయాలన్న దానిపై నెలంతా చర్చిస్తూనే ఉన్నారు.
ఈ ఇద్దరిలో...
ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా నగరానికి వచ్చిన సందర్భంలో శాసనసభ పక్ష నేత ఎన్నిక జరుగుతుందని భావించారు. అయితే అప్పుడు జరగకపోవడంతో ఇప్పుడు ఈ ఎన్నికను నిర్వహించాలని నిర్ణయించారు. మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు శాసనసభ పక్ష నేత ఎన్నిక ఉంటుందని పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ రేసులో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తో పాటు నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఒక పేరును నేడు ఖరారు చేసే అవకాశముంది.