నేడు అవినాష్ బెయిల్ పై సీబీఐ వాదనలు
వివేకా మరణం గురించి బయటి ప్రపంచానికి తెలియక ముందే సీఎం జగన్ కు తెలిసిందని సీబీఐ చెబుతోంది.
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ నిందితుడిగా భావిస్తోన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగనుంది. నిన్న (మే26) అవినాష్, సునీత తరపు వాదనలు ముగిశాయి. సుదీర్ఘంగా సాగిన వాదనల అనంతరం.. తదుపరి విచారణను కోర్టు నేటికి వాయిదా వేసింది. నేడు ఉదయం 10.30 గంటలకు సీబీఐ వాదనలు మొదలు కానున్నాయి.
ఇదిలా ఉండగా.. వివేకా హత్యకేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ పేరును ప్రస్తావించి.. సీబీఐ షాకిచ్చింది. వివేకా మరణం గురించి బయటి ప్రపంచానికి తెలియక ముందే సీఎం జగన్ కు తెలిసిందని సీబీఐ చెబుతోంది. వివేకా మరణించిన రోజున 2019, మార్చి 15వ తేదీ ఉదయం 6.15 గంటలకు ఈ విషయం అందరికీ తెలిస్తే.. జగన్ కు అంతకన్నా ముందే తెలిసినట్లు సీబీఐ అధికారులు గుర్తించినట్లు పేర్కొన్నారు. అయితే.. అవినాష్ రెడ్డి ద్వారానే ఆయనకు ఈ విషయం తెలిసిందా ? లేక మరెవరైనా చెప్పారా ? జగన్ కు వివేకా హత్య గురించి అందరికన్నా ముందు ఎలా తెలిసిందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.