Telangana : ఇందిరమ్మ ఇల్లు కావాలా? అయితే ఈరోజు నుంచి ఇలా చేయాల్సిందే
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నేటి నుంచి ఇందిరమ్మఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రక్రియను ప్రారంభించనుంది
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నేటి నుంచి ఇందిరమ్మఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రక్రియను ప్రారంభించనుంది. కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన గ్యారంటీల మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నేటి నుంచి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టునుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన యాప్ ను నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ప్రారంభించనున్నారు. ఈ యాప్ లో దరఖాస్తు చేసుకున్న వారి పేర్లను ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం కోసం పరిశీలిస్తారు. లబ్దిదారుల ఎంపికతో పాటు ఐదు లక్షల రూపాయల మొత్తాన్ని ఇళ్ల నిర్మాణానికి ఇస్తుండటంతో వీటికి అధిక డిమాండ్ ఏర్పడింది.
ఎన్నో ఏళ్ల నుంచి...
చాలా రోజుల నుంచి తెలంగాణలో సొంత ఇంటి కోసం అనేక మంది ఎదురు చూస్తున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను గత ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కొద్దిమందికి మాత్రమే అందాయి. అయితే ఎక్కువ మంది నిరుపేదలు సొంత ఇంటి కోసం వేచి చూస్తున్నారు. ఇందుకోసం ఎన్నో ఏళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న వారికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేటి నుంచి గుడ్ న్యూస్ చెప్పనుంది. యాప్ లో మొత్తం 35 ప్రశ్నలుంటాయి. ఈ ప్రశ్నలకు సంబంధించిన జవాబులను పూర్తి చేయాల్సి ఉంటుంది. గ్రామసభల్లో లబ్దిదారుల ఎంపిక జరుగుతుంది. ఇప్పటికే గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో లబ్దిదారుల ఎంపిక జరగనుంది.
తొలి దశలో...
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున తొలి దశలో 4.50 లక్షల మందికి ఇళ్లను నిర్మించి ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. తొలుత భధ్రాద్రి కొత్తగూడెం, మెదక్ జిల్లాల్లో ఈ ఇందిరమ్మ ఇళ్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం నేటి నుంచి యాప్ లో తమ పేర్లను నమోదు చేసుకునే వీలు లబ్దిదారులకు కల్పించనున్నారు. తొలి దశలో సొంత స్థలం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. నిరుపేదలైన వారికి మాత్రమే తొలి విడతగా పక్కా ఇళ్లను మంజూరుచేయనున్నారు. రెండో దశలో స్థలం లేని నిరుపేదలను లబ్దిదారులుగా ఎంపిక చేయనున్నారు. యాప్ లో విజయవంతంగా ప్రశ్నలుపూర్తి చేసిన వారి పేర్లను పరిశీలించనున్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి మాత్రమే ఇందిరమ్మఇళ్లు మంజూరవుతాయి.