Jeevan Reddy : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్నారా? ఎప్పుడంటే?

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలున్నాయి. ఆయన త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారని తెలిసింది

Update: 2024-10-22 07:06 GMT

jeevan reddy 

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలున్నాయి. ఆయన త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారని తెలిసింది. ఈ మేరకు జగిత్యాలలో ఆయన తన అనుచరులతో సమావేశమైన జీవన్ రెడ్డి ఒకటి, రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారని చెబుతున్నారు. తన ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్యకు గురి కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మీకో దండం.. మీ పార్టీకో దండం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని, అయినా పార్టీ కోసం భరిస్తూ వస్తున్నానని జీవన్ రెడ్డి తెలిపారు.

సీనియర్ నేతగా...
జీవన్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. కొన్ని దశాబ్దాలుగా ఆయన కాంగ్రెస్ లో కీలక నేతగా కొనసాగుతున్నారు. దాదాపు నలభై ఏళ్ల నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. తొలుత టీడీపీ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమయినా తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన కొనసాగుతున్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యలు పెరిగాయని, శాంతిభద్రతలు పెరిగాయని జీవన్ రెడ్డి ఆరోపించడం కూడా ఆయన పార్టీ పట్ల ఎంత విసుగు చెందారో? అర్థమవుతుంది. జీవన్ రెడ్డి సీనియర్ నేత కావడంతో ఆయన కాంగ్రెస్ నుంచి వైదొలిగితే ఆ ప్రాంతంలో పార్టీకి పెద్ద షాక్ అని చెప్పాలి.
ఆయన చేరికతో...
గతంలోనే జీవన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. జగిత్యాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన సంజీవ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న నాటి నుంచి ఆయనలో అసహనం కట్టలు తెంచుకుంటోంది. పార్టీ తనకు అన్యాయం చేస్తుందన్న భావనకు వచ్చారు. అప్పుడే రాజీనామాకు సిద్ధపడిన జీవన్ రెడ్డి హైకమాండ్ పెద్దలు సముదాయించారు. ఢిల్లీకి పిలిపించి మరీ శాంతింప చేశారు. మంత్రి పదవి కూడా దక్కకపోవడంతో జీవన్ రెడ్డి చాలా కాలం నుంచి అసంతృప్తితో ఉన్నారు. తనకు మంత్రి పదవి రాకుండా కావాలనే కొందరు అడ్డుకుంటున్నారని ఆయన గాంధీభవన్ కు రావడం కూడా ఇటీవల కాలంలో తగ్గించారు. పార్టీలో కూడా యాక్టివ్ గా కనిపించడం లేదు.
తెలంగాణ వచ్చిన తర్వాత కూడా...
అయితే ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డి కఠిన నిర్ణయం తీసుకోవాలని సిద్ధమయినట్లు తెలిసింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తమ పార్టీ కాంగ్రెస్ నేతలకు న్యాయం జరగకపోగా, తన ప్రధాన అనుచరుడు గంగారెడ్డిని హత్యచేయడాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఇక పార్టీలో ఉండి కూడా వేస్ట్ అన్న నిర్ణయానికి వచ్చారు. పార్టీలో కొనసాగడం కంటే క్విట్ అవ్వడమే మేలన్న అభిప్రాయానికి వచ్చారు. అధికారంలో ఉండి కూడా ఇలా తన వాళ్లను హత్యచేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటానని ఆయన ప్రశ్నిస్తున్నారు. గతంలో సంజీవ్ కుమార్ ను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేర్చుకున్నప్పుడు కూడా మంత్రులు వెళ్లి కొంత శాంతింప చేశారు. ఈసారి అలా కాకుండా ముందు రాజీనామా చేసేసి ఆ తర్వాత భవిష్యత్ నిర్ణయాన్ని ప్రకటించాలని జీవన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది.


Tags:    

Similar News