కాంగ్రెస్‌లో ఫ్యామిలీ టికెట్ల లొల్లి..

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ దూకుడు మొదలైంది. పార్టీ కార్యకలాపాలను మరింత స్పీడు పెంచింది. ఎలాగైనా కారు (బీఆర్‌ఎస్‌)కు..

Update: 2023-09-03 13:13 GMT

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ దూకుడు మొదలైంది. పార్టీ కార్యకలాపాలను మరింత స్పీడు పెంచింది. ఎలాగైనా కారు (బీఆర్‌ఎస్‌)కు హస్తంతో బ్రేకులు వేసి అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తోంది. అయితే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. టీ కాంగ్రెస్ ధరఖాస్తులను పార్టీ పరిశీలిస్తోంది.ఈ పరిశీలనలో పలు కీలక అంశాలు తెరపైకి వస్తున్నాయి. పలువురు సీనియర్ నేతలు ఫ్యామిలీ ప్యాక్ ను ప్రదేశ్ ఎన్నికల కమిటీ ముందు ఉంచారు. ముందు టికెట్ల విషయంలో పోటాపోటీగా అభ్యర్థులు వస్తుంటే వాటిని పరిశీలించి ఎవ్వరికి టికెట్‌ ఇవ్వాలి..? ఎవరికి ఇవ్వొద్దు అనే ఆలోచనలో ఉంటే ఈ ఫ్యామిలీ టికెట్ల లొల్లి ఎంటనేది పెద్ద పంచాయతీలా మారింది.

ఎవరికీ వారి కుటుంబంలో టికెట్ల లొల్లి కొనసాగుతోంది. కుటుంబంలో ఒకరికి టికెట్‌ కాకుండా ఇద్దరిద్దరికి టికెట్లు అడుగుతుండటం పార్టీ నేతలకు పెద్ద సమస్యగా మారిపోయింది. అభ్యర్థుల పేరు ఖరారు చేయడం ఏంటోగానీ ఫ్యామిలీ ప్యాక్‌ టికెట్ల గొడవ ఎక్కువైపోయిందని నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాము.. ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ వెన్నంటి ఉంటూ కష్టపడుతున్నామని, అందుకే తమ ఫ్యామిలిలో ఒకరికి టికెట్‌ కేటాయించాలంటూ అభ్యర్ధనలు పెట్టుకుంటున్నారు. అంతేకాదండోయ్‌.. ఒకే కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు. ఇలా ఒకే కుటుంబంలో రెండేసి టికెట్లు అంటే సాధ్యమేనా..? ఈ కుటుంబాల టికెట్ల లొల్లి  పార్టీ నేతలకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది.

ఒకే కుటుంబంలో రెండేసి టికెట్లు అడుగుతున్న వారిలో..

ఇక ఎవరికి వారు తమ కంటే తమకు టికెట్‌ కావాలంటూ అభ్యర్థలను అటుంచితే.. ఒకే కుటుంబానికి రెండు టికెట్లు అడుగుతున్న వారిలో ఉత్తంకుమార్ రెడ్డి, జానారెడ్డి, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, బలరాం నాయక్, సీతక్క, అంజన్ కుమార్ యాదవ్‌లు ఉన్నారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఫ్యామిలీలో తనకు ,తన భార్య ఉత్తమ్ పద్మవతి కి ఇద్దరికీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఉత్తమ్ పద్మావతి మాజీ ఎమ్మెల్యే కావడంతో టిక్కెట్ విషయం లో ఏఐసీసీ సానుకూలంగా ఉంటుందనే చర్చ కొనసాగుతోంది. ఇక జానారెడ్డి విషయానికొస్తే.. తన ఇద్దరు కొడుకులు టికెట్‌ కావాలంటూ డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకరికి నాగార్జున సాగర్ నుంచి మరొకరికి మిర్యాలగూడ నుంచి. ఎమ్మెల్యే సీతక్క తన కొడుకు సూర్యంకు కూడా ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వాలంటూ అభ్యర్థిస్తున్నట్లు తెలుస్తోంది. సూర్యంకు పినపాక నుంచి పోటీలో దింపాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోనేత బలరాం నాయక్ తనకు మహాబూబాబాద్ టిక్కెట్, తన కొడుకు సాయిరాం శంకర్కు ఇల్లందు నుంచి పోటీ నిలుపుతానని, అందుకు మా ఫ్యామిలీలో రెండు టికెట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇక కొండ మురళీ దంపతులకు రెండు టికెట్లు కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. పరకాల నుంచి కొండ మురళీకి, వరంగల్‌ తూర్పు నుంచి కొండ సురేఖ టికెట్‌ ఆశిస్తున్నారు. ఇక దామోదర రాజనర్సింహ విషయానికొస్తే ఈయన కుటుంబం నుంచి రెండు టికెట్లు కావాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. తన కుటుంబం నుంచి తనతో పాటు కూతురుకు కూడా టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఒకవేళ తనకు ఇవ్వకుంటే కూతురుకైనా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇక మరోనేత అంజన్ కుమార్ యాదవ్ అయితే తనకు తన ఇద్దరు కుమారులకు టికెట్లు కావాలంటున్నారట. ఇలా ఫ్యామిలీ టికెట్ల లొల్లి కొనసాగుతోంది. ఒకే కుటుంబంలో ఇద్దరిద్దరికి టికెట్లు కావాలంటూ పట్టుబడుతుండటంతో పార్టీ నేతలకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది.

Tags:    

Similar News