సీఎంకు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న రైతు

రైతు తన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు

Update: 2021-12-10 12:21 GMT

కాలం మారే కొద్దీ నిత్యావసర వస్తువుల ధరలన్నీ కాలానుగుణంగా పెరుగుతున్నాయి. కానీ.. పంట పండించే రైతుకు మాత్రం ఇప్పటికీ గిట్టుబాటు ధర రావడం లేదు. అకాల వర్షాలకు పంట పోయిందని, గిట్టుబాటు ధరలు రాలేదని, నష్టపరిహారాలు అందలేదన్న కారణాలతో ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ.. ఎన్ని ఆత్మహత్యలు జరిగినా ప్రభుత్వాలు మాత్రం రైతులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా మరో రైతు తన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తెలంగాణలోని మెదక్ జిల్లాలోని హవేలి ఘనపూర్ మండలం బొగుడ భూపతిపూర్ లో జరిగింది. ఆత్మహత్యకు ముందు ఆ రైతు సీఎంకు లేఖ రాసి చనిపోవడం అందరినీ కలచివేసింది.

అప్పుల బాధతో...
ఒకపక్క ఇంజినీరింగ్ చేసిన కొడుక్కి ఉద్యోగం రాలేదు. 60 ఏళ్లు నిండినా తన తండ్రికి పెన్షన్ రావడం లేదు. మరోవైపు తాను వేసిన పంటలో నకిలీ పురుగుల మందులు, ప్రకృతి విపత్తులు.. వీటన్నింటికీ తోడు పెట్టుబడికి చేసిన అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కరణం రవికుమార్ (40) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సీఎం కేసీఆర్ కు రాసినట్లుగా ఉన్న సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. తాను సాగు చేసిన సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం కనీస మద్దతు ధర ఇవ్వలేదని మృతుడు రవి లేఖలో పేర్కొన్నాడు. రైతు రవి ఆత్మహత్యతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


Tags:    

Similar News