ఫుడ్ పాయిజన్.. 70 మంది విద్యార్థినులకు అస్వస్థత
కేజీబీవీలో ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ మొత్తం 210 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. గతరాత్రి వంకాయ కూర..
కల్తీ ఆహారం తినడంతో.. 70 మంది విద్యార్థినులు తీవ్ర కడుపునొప్పి, వాంతులతో ఆసుపత్రి పాలయ్యారు. తెలంగాణలోని వనపర్తి జిల్లా అమరచింత కస్తూర్భా విద్యాలయంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. కస్తూర్భా విద్యాలయ వసతి గృహంలో విద్యార్థినులు రాత్రి భోజనం తిన్న తర్వాత.. అస్వస్థతకు గురయ్యారు. కేజీబీవీలో ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ మొత్తం 210 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. గతరాత్రి వంకాయ కూర, సాంబారుతో కూడిన ఆహారాన్ని విద్యార్థినులకు వడ్డించారు. భోజనం చేసిన తర్వాత 11 గంటల సమయంలో విద్యార్థినులు తీవ్ర కడుపునొప్పికి గురయ్యారు.
ఒక్కొక్కరుగా కడుపులో నొప్పిగా ఉందంటూ సిబ్బంది వద్దకు వెళ్లగా.. అక్కడ ఒక టీచర్, వాచ్ మన్ మాత్రమే ఉండటంతో ఎవరినీ బయటకు పంపలేదు. రాత్రంతా కడుపునొప్పితో బాధపడిన విద్యార్థినులను.. ఉదయం ప్రైవేటు వాహనంలో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరిన విద్యార్థినులందరికీ వైద్యులు చికిత్స అందించగా.. పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు సమాచారం. నలుగురు విద్యార్థినులకు మాత్రం కడుపునొప్పి తగ్గకపోవడంతో వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పిల్లల్ని చూసేందుకు ఆత్మకూరు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. విద్యార్థినులు అస్వస్థతకు గురవడానికి గల కారణాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థినుల్లో 9,10, ఇంటర్ విద్యార్థినులే అధికంగా ఉన్నట్లు సమాచారం.