KCR : కేసీఆర్ ఇచ్చిన సమయం పూర్తయిందా? ఇక దబిడి దిబిడేనా?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే జనంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

Update: 2024-12-08 11:49 GMT

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే జనంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఆయన ముందుగా డిసెంబరు 9వ తేదీ నుంచి జరగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా? లేదా? అన్నది మాత్రం సందేహంగా మారింది. కేసీఆర్ కొత్త ప్రభుత్వానికి ఏడాది గడువు ఇవ్వాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావడంతో ఇక అసెంబ్లీ సమావేశాలకు హాజరై కేసీఆర్ రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇస్తారా? లేదా? అన్నది గులాబీ పార్టీలో ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ సమావేశాలకు రావాలంటూ కాంగ్రెస్ నేతలు ఛాలెంజ్ ల మీద ఛాలెంజ్ లు విసురుతున్న నేపథ్యంలో ఆయన సభకు వచ్చి తన ప్రసంగాలతో అధికార పార్టీని ఇరుకున పెట్టే అవకాశాలు లేకపోలేదని గులాబీ పార్టీ వర్గాలు తెలిపాయి. సంక్రాంతి తర్వాత జనంలోకి వచ్చి ప్రభుత్వ నిర్ణయాలకు, ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు నిరసనగా పర్యటనలు చేస్తారంటున్నారు.

ఏడాది నుంచి ఫాం హౌస్ లోనే…

2023 ఎన్నికల ఫలితాలు వస్తుండగానే నేరుగా కారులో ఎర్రవెల్లిలోని ఫాం హౌస్ కు వెళ్లిపోయిన కేసీఆర్ ఇక పెద్దగా ఎక్కడా కనిపించలేదు. తర్వాత బాత్ రూంలో జారిపడి కాలు తుంటె విరగడంతో కొంత కాలం విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత కుమార్తె కవిత జైలుకెళ్లడంతో ఇక ఆయన బయటకు రాలేదు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వచ్చినప్పటికీ జీరో రిజల్ట్ రావడంతో ఆ ఎన్నికల ఫలితాల తర్వాత అస్సలు బయటకు రావడం లేదు. పార్టీ నుంచి ముఖ్యమైన నేతలు వెళ్లిపోతున్నా పట్టించుకోవడం లేదు. పెద్దగా ఆయన సీరియస్ గా తీసుకోలేదు. ఇది రాజకీయాల్లో సాధారణమేనని భావించినట్లున్నారు. అందుకే నేతలు వెళ్లిపోకుండా ఎలాంటి హడావిడి చేయలేదు. ఆయనకు రాజకీయాలు కొత్త కాదు. ఎటు పవర్ ఉంటే అటు వైపు వెళ్లేవారు ఎక్కువ మంది ఉంటారన్నది ఆయనకు తెలుసు. అయితే తాను బలంగా నమ్మిన వారు వెళ్లిపోవడాన్ని మాత్రం ఒకింత కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారంటున్నారు

ముఖ్య నేతలు వెళ్లిపోయినా…

ముఖ్యంగా కె. కేశవరావు, పోచారం శ్రీనివాసరెడ్డి వంటి నేతలు పార్టీని వీడినప్పుడు కేసీఆర్ ఒకింత బాధపడ్డారని, మిగిలిన వాళ్ల విషయంలో పెద్దగా రెస్పాండ్ కాలేదని గులాబీ పార్టీ నేతలు చెబుతారు. అయినా సరే వారిని ఆగాలని కేసీఆర్ కోరలేదు. పార్టీ బాధ్యతలను కూడా పూర్తిగా కుమారుడు కేటీఆర్ కు అప్పగించారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఎవరైనా నేతలు కలవాలనుకుంటే కేసీఆర్ తో మాట్లాడాలనుకుంటే ఫాం హౌస్ కు వెళ్లాల్సిందే. అక్కడి నుంచి పిలుపు వస్తే తప్ప నేతలు వెళ్లే అవకాశం లేదు. అందుకే నేతలకు కూడా ఆయన దూరంగా ఉన్నారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మహబూబ్ నగర్ లోనే ఈ విషయం చెప్పారు. తనను ఓడించినా ఒరిగేదేమీ లేదని, తాను ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన కేసీఆర్ అదే మాటకు కట్టుబడి అలాగే ఉంటూ వస్తున్నారు. జిల్లాల పర్యటనలకు కూడా రావడం లేదు. పార్టీ ముఖ్యమైన కార్యక్రమాలను కూడా పట్టించుకోవడం లేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావడంతో కేసీఆర్ త్వరలోనే జనంలోకి వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అసెంబ్లీ.. ఆ తర్వాత…

తొలుత డిసెంబరు 9వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యే అవకాశాలున్నాయని తెలిసింది. ఆయన అసెంబ్లీకి వచ్చి తన గళం వినిపిస్తారంటున్నారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా రాకుండా ఫాం హౌస్ కే పరిమితమయ్యారన్న విమర్శల నుంచి బయటపడేందుకు ఆయన సభకు వస్తారని చెబుతున్నారు. ముఖ్యమైన అంశాలపై ఇప్పటికే ఆయన అథ్యయనం చేస్తున్నారని చెబుతున్నారు. తన ప్రసంగాలను సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఆయన కేసీఆర్.. చివరి నిమిషంలో మనసు మార్చుకుంటే ఎవరూ ఏమీ చేయలేమన్న కామెంట్స్ కూడా పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు సంక్రాంతి పండగ తర్వాత పూర్తిగా జనంలో ఉండేలా కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారని చెబుతున్నారు. క్యాడర్ లో, లీడర్లలో పూర్తిగా మళ్లీ యాక్టివ్ నెస్ తెచ్చేలా కేసీఆర్ పర్యటనలు సాగనున్నాయని తెలిసింది. ఇందుకోసం వరంగల్ నుంచి ఆయన జిల్లాల సభలకు శ్రీకారం చుడతారని చెబుతున్నారు. మొత్తం మీద కేసీఆర్ రీ ఎంట్రీతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశాలున్నాయి.



ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News