తెలంగాణకు మూడ్రోజులు భారీ వర్షసూచన
మరోవైపు భారీవర్షాల నేపథ్యంలో హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాజధాని నగరంలో రెండ్రోజులుగా వర్షాలు..
తెలంగాణను మరోసారి భారీవర్షాలు అతలాకుతలం చేయనున్నాయి. మరో మూడ్రోజులపాటు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
మరోవైపు భారీవర్షాల నేపథ్యంలో హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాజధాని నగరంలో రెండ్రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో కురిసిన వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హయత్ నగర్, శేరిలింగంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సరూర్ నగర్, కాప్రా ప్రాంతాలన్నీ వర్షపునీటితో జలమయమయ్యాయి.
పిడుగుపాటుకి నలుగురు మృతి
విధ ప్రాంతాల్లో పిడుగులు పడి నలుగురు చనిపోయారు. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం ఈదమ్మబండ తండాలో పిడుగు పాటుకు ఇద్దరు మృతి చెందారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కన్నాయపల్లిలో పిడుగుపడి అలాట చంద్రమౌళి అనే వ్యక్తి , రెండు ఎడ్లు మరణించాయి. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని చందారం శివారులో పిడుగుపాటుకు కొమ్ము సత్తన్న అనే ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు.