తెలంగాణకు అమిత్ షా.. షెడ్యూల్ ఖరారు
జూన్ 15వ తేదీన భద్రాచలంలో శ్రీరాముల వారిని దర్శించుకోవడంతో అమిత్ షా పర్యటన ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు..
అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో.. బీజేపీ తెలుగు రాష్ట్రాలపై కన్నేసింది. ఈసారి ఎన్నికల్లో అధికారంలోకి రావాలని సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కేంద్రమంత్రులు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. మొన్న మంత్రి జేపీ నడ్డా, నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీలో భారీ బహిరంగ సభలు నిర్వహించి.. అధికార ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఇక తాజాగా అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ మేరకు షెడ్యూల్ ప్రకటించారు.
జూన్ 15వ తేదీన భద్రాచలంలో శ్రీరాముల వారిని దర్శించుకోవడంతో అమిత్ షా పర్యటన ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకూ స్థానిక నేతలతో అల్పాహార విందు చేస్తారు. మధ్యాహ్నం 1.10 గంటలకు శంషాబాద్ నుంచి భద్రాచలంకు బయల్దేరుతారు. మధ్యాహ్నం 2.30 గంటల నుండి 3.20 గంటల సమయంలో రాములవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు.
అనంతరం ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి, ఎస్ఆర్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసే బీజేపీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ ముగిసిన తర్వాత సాయంత్రం 6 గంటలకు శంషాబాద్ కు తిరుగుపయనమవుతారు. 15వ తేదీ రాత్రి 7 గంటలకు పలువురు నేతలతో వేర్వేరుగా సమావైశమవుతారు. రాత్రి 9.30 గంటలకు శంషాబాద్ నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరుతారు. కాగా.. పార్టీ ఎమ్మెల్యే, మాజీమంత్రి ఈటల రాజేందర్ ను త్వరలోనే బీజేపీ రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా నియమిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అమిత్ షా పర్యటన, సమావేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది.