KCR : బీఆర్ఎస్ ఓటమికి కారణాలు చెప్పిన కేసీఆర్.. ఓటమి సహజమేనంటూ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక ఆంక్షలు విధించినప్పటికీ పోరాడి రాని తెలంగాణను సాధించుకున్నామని కేసీఆర్ అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక ఆంక్షలు విధించినప్పటికీ పోరాడి రాని తెలంగాణను సాధించుకున్నామని కేసీఆర్ అన్నారు. కరీంనగర్ సభలో ఆయన ప్రసంగించారు. కరీంనగర్ గడ్డ పోరాటాల అడ్డా అని ఆయన అన్నారు. రాజకీయల్లో అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయన్నారు. కొన్ని సందర్భాల్లో అత్యాశకు, దురాశకు ప్రజలు మోసపోతారని, మొన్న కూడా ప్రజలు మోసపోయి కాంగ్రెస్ ను గెలిపించారన్నారు. వంద రోజుల్లో తెలంగాణలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసి వచ్చిందన్నారు. రైతు బంధు నుంచి కల్యాణలక్ష్మి వరకూ 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయడమంటే ముఖ్యమంత్రి పేగులు మెడలో వేసుకుంటానంటూ వార్నింగ్‌లు ఇస్తున్నారన్నారు.
ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష...
ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష ఇదేనా? అంటూ ఆయన ప్రశ్నించారు. తెలంగాణ సమాజం గౌరవం పెంచే విధంగా ముఖ్యమంత్రి మాటలు ఉండాలన్నారు. తాను ఉద్యమంలో మాట్లాడిన మాట వాస్తవమేనని, కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను ఏనాడైనా పరుష పదజాలంతో మాట్లాడానా? అని ప్రశ్నించారు. సరిగా కరెంట్ కూడా ఇవ్వలేకపోతున్నారన్నారు. సాగునీటిని కూడా అందించలేపోతున్నారని చెప్పారు. కాంగ్రెస్ గెలిచిందన్న ఈర్ష్య తమకు లేదన్నారు. తమతో పోటీ పడేలా పాలన సాగించాలని కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ హితవు పలికారు. తాను అహోరాత్రులు శ్రమించి రాష్ట్రాన్ని బాగు చేయాలని భావించానని తెలిపారు. కరోనా వచ్చి ఖజానాను కాటేసినా కరెంటును ఆపలేదన్నారు. రైతు బంధు నిధులను నిలిపివేయలేదని అన్నారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే...
మళ్లీ కాంగ్రెస్ కే ఓటేస్తే రైతు బంధు ఇవ్వకున్నా, కరెంటు సరఫరా లేకపోయినా మాకే ఓటేశారని కాంగ్రెసోళ్లు భావిస్తారని కేసీఆర్ అన్నారు. అందుకే రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాతపెట్టాలని అన్నారు. గులాబీ జెండాను ఎగురవేసి సత్తా చాటుదామని పిలుపునిచ్చారు. గులాబీ పార్టీయే తెలంగాణకు కాపలాదారుగా ఉంటుందని కేసీఆర్ అన్నారు. బీజేపీ కూడా ఓటు వేయద్దని కోరారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ప్రయోజనమూ చేయని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు. కరీంనగర్ లో బండి సంజయ్ ఎంపీగా ఉన్నారని, ఐదు రూపాయలు పనిచేశాడా? అని నిలదీశారు. కేసీఆర్ ఉన్ననాళ్లు ఒక ఎకరం పొలం ఎండిందా? నేడు ఏం బీమార్ వచ్చిందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అబద్ధపు ప్రచారం చేస్తూ అసలు విషయాన్ని పక్కన పెడుతున్నారన్నారు. మార్చి నెలలోనే ఇలా ఉంటే మే నెలలో ఏం కావాలని ఆయన అన్నారు. కరీంనగర్ లో వినోద్ కుమార్ ను గెలిపించాలని ఆయన కోరారు.