Kamareddy : సొంత ఇంటినే కూలగొట్టుకున్న ఎమ్మెల్యే.. రీజన్ ఇదే

ఇచ్చిన మాటకు కట్టుబడి తన సొంత ఇంటినే కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కూల్చివేశారు.

Update: 2024-01-28 03:04 GMT

ఇచ్చిన మాటకు కట్టుబడి తన సొంత ఇంటినే కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కూల్చివేశారు. రోడ్ల విస్తరణ పనుల కోసం తన ఇంటిని తాను కూల్చుకున్నారు. వెయ్యి గజాల స్థలాన్ని మున్సిపల్ అధికారులకు ఇచ్చారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎనభై అడుగుల రోడ్డు ఉండాలి. అయితే ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన వెంకట రమణారెెడ్డి తాను ఎమ్మెల్యేగా గెలిచినా, గెలవకపోయినా తన ఇంటిని రోడ్డు విస్తరణ కోసం కూల్చి వేస్తానని చెప్పారు.

రోడ్డు విస్తరణకు...
ఆ ప్రకారమే తన నివాసాన్ని కూల్చి వేసి ఆదర్శంగా నిలిచారు. ఎమ్మెల్యే తన ఇంటినే రోడ్డు విస్తరణ కోసం స్వయంగా కూల్చివేసుకోవడంతో మిగిలిన వారు కూడా రోడ్డు విస్తరణకు సహకరించక తప్పదు. ఎమ్మెల్యే తన ఇంటిని కూల్చి స్థలాన్ని మున్సిపల్ అధికారులకు అప్పగించిన వెంటనే అధికారులు రోడ్డు విస్తరణలో అడ్డంగా ఉన్న అనేక ఇళ్లకు నోటీసులు అందించారు. అదే రోడ్డులో మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇల్లు కూడా ఉంది. ఆయన కూడా సహకరించాలని కోరుతున్నారు. రమణారెడ్డిపై ప్రశంసలు కురుస్తున్నాయి.

జెయింట్ కిల్లర్ గా...
కామారెడ్డిలో గత ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసిన వెంకట రమణారెడ్డి జెయింట్ కిల్లర్ గా నిలిచారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ను, ఇటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఓడించి వార్తల్లోకి ఎక్కారు. ఎన్నో ఏళ్లుగా రమణారెడ్డి కామారెడ్డి ప్రజలకు దగ్గరగా ఉంటూ వారి సమస్యలలో పాలుపంచుకుంటున్నారు. వారికి అండగా నిలుస్తున్నారు. వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా తన సొంత ఇల్లును కూలగొట్టుకోవడంతో ఆయన మరోమారు వార్తల్లోకెక్కారు.


Tags:    

Similar News