రైతుబంధువును ఆదరించండి.. రాబందులను తరిమికొట్టండి: కేటీఆర్

రైతులకు 3 గంటల కరెంటు చాలని రేవంత్‌ రెడ్డి అంటున్నాడు.. రైతులు ఏ మోటారు వాడుతారో

Update: 2023-11-27 10:47 GMT

రైతుబంధు పడకుండా కాంగ్రెస్‌ పార్టీ అడ్డుకుందని ఆరోపించారు మంత్రి కేటీఆర్. రైతుబంధుపై కాంగ్రెస్‌ వక్రబుద్ధి బయటపడిందని.. కాంగ్రెస్‌ ఉంటే కరెంటు ఉండదని.. ధరణిని రద్దుచేసి పట్వారీ వ్యవస్థ మళ్లీ తెస్తామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారన్నారు కేటీఆర్. కరెంటు కావాలా.. కాంగ్రెస్‌ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ధర్మపురిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు మద్దతుగా నిర్వహించిన రోడ్‌ షోలో కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతుబంధు తీసేస్తారు. కాంగ్రెస్‌, బీజేపీ కలిసి రైతుబంధు రాకుండా చేశాయి. రైతుబంధు పార్టీ కావాలా.. రాబందుల పార్టీ కావాలా అని ప్రజలకు పిలుపును ఇచ్చారు కేటీఆర్. కరెంటు గురించి మాట్లాడేందుకు కాంగ్రెస్‌ నేతలకు సిగ్గుండాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రైతులకు 3 గంటల కరెంటు చాలని రేవంత్‌ రెడ్డి అంటున్నాడు.. రైతులు ఏ మోటారు వాడుతారో తెల్వని సన్నాసులు కాంగ్రెస్‌ నేతలన్నారు కేటీఆర్.

రైతుబంధు పంపిణీకి ఈసీ ఇటీవలే అనుమతి ఇచ్చి.. అనూహ్యంగా నేడు ఆ అనుమతుల్ని వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్‌ పార్టీ మరోసారి ఈసీని ఆశ్రయించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. అనుమతిని నిరాకరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరింది. మంత్రి హరీశ్‌ రావు ఈ పథకాన్ని ప్రచారం చేయలేదని.. అనుమతి మంజూరు చేసినందుకు ఈసీకి కృతజ్ఞతలు మాత్రమే తెలిపారని వివరించింది. దీన్ని ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనగా పరిగణించలేమని బీఆర్‌ఎస్‌ పార్టీ తన లేఖలో పేర్కొంది.


Tags:    

Similar News