భారీ వర్షం.. నీట మునిగిన వరంగల్ కాలనీలు
వరంగల్ అండర్ రైల్వే గేట్, పెరుకావాడ, సాకరశికుంట, ఏకశిలా నగర్, కరీమాబాద్, ఎస్ఆర్ఆర్ తోట, ఉర్సుగుట్ట,
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ ఇలా అనేక నగరాల్లో రాత్రి నుంచి ఎడతెరపి లేని వర్షం కురుస్తోంది. మూడ్రోజులుగా ఎండలు పెరగ్గా.. నిన్నటి నుంచి కురిసిన వర్షం ప్రజలకు కాస్త ఉపశమనాన్ని ఇచ్చింది. కానీ ఒక్కసారిగా కురిసిన వర్షానికి వరంగల్ నగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి.
Also Read : దారుణం.. వైద్యం వికటించి 5 నెలల గర్భిణీ మృతి
వరంగల్ అండర్ రైల్వే గేట్, పెరుకావాడ, సాకరశికుంట, ఏకశిలా నగర్, కరీమాబాద్, ఎస్ఆర్ఆర్ తోట, ఉర్సుగుట్ట, బిఆర్ నగర్, శివ నగర్, సమ్మయ్య నగర్ లతో పాటు పలు కాలనీలో జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీళ్లు నిలిచిపోవడంతో.. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షపునీరు డ్రైనేజీల్లోకి వెళ్లే వీలు లేకపోవడంతో భారీగా వరద నీరు నిలిచిపోయిందని స్థానికులు చెప్తున్నారు. చిన్నపాటి వర్షానికే వరంగల్ మునిగిపోతోంటే.. అధికారులు, కార్పొరేటర్లు చోద్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీలకు మరమ్మతులు చేయించడం, వెడల్పు చేయించడం వంటి పనుల్లో అలసత్వం వహించడం వల్లే ఎప్పుడు వర్షం వచ్చినా ఇలాగే జరుగుతోందని వాపోతున్నారు.
కాగా.. మరో రెండ్రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో వరంగల్ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. అంటువ్యాధులు ప్రబలే ఆస్కారం ఉందని, వెంటనే తగు చర్యలు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.