కాపాడండి ప్లీజ్.. జలదిగ్భంధంలో మోరంచపల్లి
బుధవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీవర్షానికి మోరంచవాగు ఉగ్రరూపం దాల్చింది. భూపాలపల్లి - పరకాల..
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఓ ఊరు ఊరంతా జలదిగ్భంధంలో చిక్కుకుంది. ఇళ్లు, భవనాలు మునిగిపోవడంతో మేడలపైకి వెళ్లి.. వర్షాల్లో తడుస్తూ మమ్మల్ని కాపాడండి ప్లీజ్ అంటూ.. సెల్ఫీవీడియోలు తీసి నెట్టింట పోస్ట్ చేయగా.. అవి వైరల్ అయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామస్తుల దయనీయ పరిస్థితి ఇది.
బుధవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీవర్షానికి మోరంచవాగు ఉగ్రరూపం దాల్చింది. భూపాలపల్లి - పరకాల ప్రధాన రహదారిపై మోరంచపల్లి వద్ద సుమారు 15 అడుగుల ఎత్తులో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. కట్టలు తెంచుకుని ఊరిపై పడిన వాగు.. అర్థరాత్రి గ్రామాన్ని ముంచెత్తింది. ఇంకా కాసేపు ఇక్కడే ఉంటే.. మమ్మల్ని దయచేసి కాపాడండి అంటూ గ్రామస్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సెల్ఫీవీడియోలు రిలీజ్ చేశారు. తలదాచుకునేందుకు కూడా చోటు లేదని వాపోతున్నారు.
మోరంచపల్లి గ్రామంలో సుమారు 1000 మంది జనాభా ఉంటారని అంచనా. అందరూ జలదిగ్భంధంలో చిక్కుకుపోయారు. ఎలాగైనా ఊరినుంచి బయటపడదామంటే..6 ఫీట్లకు పైగానే వరద నీరు ప్రవహిస్తుందని, వాగు ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. భూపాలపల్లి పరకాల జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. రెండు లారీలు వరదనీటిలో చిక్కుకుపోగా.. లారీ డ్రైవర్లు క్యాబిన్ల పైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వరద ఉద్ధృతిలో ముగ్గురు కొట్టుకుపోయినట్లు లారీ డ్రైవర్లు చెబుతున్నారు. మోరంచపల్లె గ్రామస్తులను కాపాడేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. హెలికాఫ్టర్, బోట్ల ద్వారా గ్రామప్రజలను రక్షించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.