Revanth Reddy : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. దావోస్ టూర్ సక్సెస్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతమయిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావెస్ పర్యటన విజయవంతమయిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. తెలంగాణకు భారీ పెట్టుబడులు ఈ పర్యటనతో లభించాయని చెప్పారు. దాదాపు నలభై వేల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలను వివిధ సంస్థలతో రేవంత్ రెడ్డి కుదుర్చుకున్నారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి విదేశీ పర్యటనలోనే భారీ స్థాయిలో పెట్టుబడులు రావడం పట్ల పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తుననారు.
మూడు రోజుల పర్యటనలో...
రేవంత్ రెడ్డి బృందం దావోస్ లో మూడు రోజుల పాటు పర్యటించింది. ఈ మూడు రోజుల్లో సుమారు రెండు వందల మంది కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన వాతావరణం ఉందని ఆయన వివరించారు. తాము ఇస్తున్న, ఇవ్వబోతున్న రాయితీలను గురించి కూడా రేవంత్ బృందం వారికి వివరించి ఒప్పించడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి. గత ఏడాదితో వచ్చిన పెట్టుబడులతో పోలిస్తే ఈ ఏడాది అధికంగా వచ్చినట్లేనని, రెండు రెట్లు పెరిగాయని అధికారులు తెలిపారు.
వివిధ కంపెనీలు...
రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటనలో భాగంగా అదానీ గ్రూపుతో కూడా భేటీ అయింది. నాలుగు రంగాల్లో దాదాపు పన్నెండు వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. ఎంవోయూలపై సంతకాలు చేసింది. దీంతో పాటు టాటా టెక్నాలజీస్, జెఎస్‌డబ్ల్యూ వర్క్స్, గోడి ఎనర్జీ, అరజెన్ లైఫ్ సైన్సెస్, ఇన్నొవేరా ఫార్మాసూటికల్స్ వంటి కంపెనీీలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని కనపర్చాయి. ఇవన్నీ గ్రౌండ్ అయితే లక్షల సంఖ్యలో యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అధికారులు వెల్లడించారు. మొత్తం మీద దావోస్ పర్యటన సక్సెస్ కావడంతో రేవంత్ కూడా ఖుషీగా ఉన్నారని తెలిసింది.