వాళ్ల ఆత్మహత్యలకు కారణం ఎవరు?
ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్రంలో అరవై మంది సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు
ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్రంలో అరవై మంది సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ధర్నా చౌక్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ప్రభుత్వమే సర్పంచ్ లను సమస్యల్లోకి నెట్టిందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఆత్మహత్యలు చేసుకున్న వారు కొందరైతే, తమ భార్య పుస్తెలను అమ్ముకున్న వారు మరికొందరున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు సంబంధించిన వాటాను వెంటనే వాటికి విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కోటి రూపాయలు ఇవ్వాల్సిందే...
నిధులను కాంట్రాక్టర్లకు కట్టబెట్టడానికి నిధులను దారి మళ్లించారని రేవంత్ ఆరోపించారు. తమ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేసిన వారిని సస్పెండ్ చేస్తున్నారని, ఇది అన్యాయమని ఆయన అన్నారు. సర్పంచ్ ల తీరు పట్ల నిర్లక్ష్యం వ్యవహరించిన మంత్రి కేటీఆర్ ను ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ నిర్లక్ష్యం కారణంగానే మూసీలో మునిగి ముప్పయి మంది మరణించారన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సర్పంచ్ ల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. సర్పంచ్ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి సర్పంచ్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలని రేవంత్ డిమాండ్ చేశారు.