ఇథనాల్ పరిశ్రమ స్థాపనకు వ్యతిరేకంగా ఆందోళన.. పోలీసులపై రాళ్లదాడి
నిర్మల్ జిల్లాలో ఉద్రిక్తత కొనసాగుతుంది. దిలావర్ పూర్ లో ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కారు
నిర్మల్ జిల్లాలో ఉద్రిక్తత కొనసాగుతుంది. దిలావర్ పూర్ లో ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కారు. ఆందోళనకారులు గత కొద్ది రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. నిన్న ఆందోళనకారులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడంతో ఈరోజు ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఐదు వందల మంది పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేసినా ప్రజలు ఒక్కసారిగా దాడికి దిగారు.
అరెస్ట్ చేయడానికి రావడంతో...
గుండవల్లిలో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇది చివరకు ఘర్షణకు దారి తీసింది. రెండు వాహనాల్లో వచ్చిన పోలీసులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. వారిపై రాళ్ల దాడికి దిగారు. మరోవైపు కొందరు ఆందోళనకారులు పురుగు మందు డబ్బాలు పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును అడ్డుకుని తీరతామని ప్రజలు చెబుతున్నారు.