Revanth Reddy : నిత్యానంద స్వామి లాగా దీవి కొనుక్కొని రాజు అవ్వు.. కేసీఆర్
త్వరలో మహిళలకు గ్యాస్ సిలిండర్లు, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు హామీని అమలు చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు
త్వరలో మహిళలకు గ్యాస్ సిలిండర్లు, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు హామీని అమలు చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కు తగ్గలేదన్నారు. అడవి బిడ్డల ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తామని చెప్పారు. ఇక్కడి నుంచే కేసీఆర్ ప్రభుత్వాన్ని దించేస్తామని సమర శంఖారావాన్ని పూరించామని చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కొందరి చేతుల్లో బందీ అయిందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆదివాసీల బిడ్డలను ఆదుకుంటామని తెలిపారు. ఆదివాసీలను ఆదుకునేందుకు గత ప్రభుత్వం ప్రయత్నించింది లేదన్నారు. తన కుటుంబానికి ఉద్యోగాలు తప్ప అమరవీరులను, ఈ రాష్ట్ర యువతను కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పట్టించుకోలేదన్నారు.
త్వరలో ఆ రెండింటీని అమలు...
ఈ తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతుల్లో భద్రంగా ఉంటుందో ఇప్పటికైనా ఆలోచించమని రేవంత్ రెడ్డి కోరారు. అరవై రోజులు కాకముందే ఆరు గ్యారంటీల అమలు చేయలేదని సన్నాసులు గోల చేస్తున్నారన్నారు. పదేళ్లలో ఏనాడైనా పేద వాడి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇవ్వాలని చేశావా? అని ప్రశ్నించారు. ఐదువందలకే గ్యాస్ సిలిండర్ ను త్వరలోనే ఇంటింటికి ఇచ్చే బాధ్యతను తీసుకుందన్నారు. ప్రియాంక గాంధీ సమక్షంలో త్వరలోనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఇంటికి ఉచిత కరెంట్ రెండు వందల యూనిట్ల వరకూ ఇస్తామని, అది కూడ త్వరలోనే అమలు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.
పదిహేను రోజుల్లో 15 వేల పోస్టుల భర్తీ...
పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు వేల స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేశామని చెప్పారు. ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుని అన్ని రకాలుగా అభివృద్థి చేస్తామని తెలిపారు. హెలికాప్టర్ నుంచి చూస్తే ఎడారిలా కనిపిస్తుందన్నారు. సాగునీటి ప్రాజెక్టులు కట్టే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందా? అని ఆయన ప్రశ్నించారు. నిత్యానంద స్వామి లాగా కేసీఆర్ కూడా ఎక్కడైనా దీవిని కొనుక్కుని రాజుగా ప్రకటించుకోవాలని రేవంత్ ఎద్దేవా చేశారు. పార్లమెంటు స్థానాలు బీఆర్ఎస్ కు ఎన్ని ఇచ్చినా మోదీకి అమ్ముకున్నారని, మళ్లీ ఇస్తే అదే జరుగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. మోదీ దగ్గర గులాంగిరీ చేయడానికే రేవంత్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ప్రజల వద్దకు వస్తున్నారని రేవంత్ అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు.