పెళ్లి వస్తువులు తీసుకుని రావడానికి ట్రాక్టర్ లో వెళుతుండగా
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఖానాపురం మండలం చిలుకమ్మ నగర్ గ్రామ శివారులో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో అయిదు మంది మరణించారు.
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఖానాపురం మండలం చిలుకమ్మ నగర్ గ్రామ శివారులో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో అయిదు మంది మరణించారు. ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పెళ్ళికి కావల్సిన వస్తువుల కోసం వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రుల్ని నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతులు గుగులోతు సీతమ్మ(32), జాట్టోతు బిచ్య(45), గుగులోత్ స్వామి(55),గోవింద్(35) గూగులోతు శాంతమ్మ(45)గా గుర్తించారు.
ఈ ఘటనపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి, ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రయాణీకులు, ప్రజలు, పోలీసు అధికారులు జాగ్రత్త వహించాలని సూచించారు. పెళ్లి సామగ్రి కొనుగోలు చేసేందుకు పర్శతండా నుంచి నర్సంపేటకు ట్రాక్టర్ లో వెళ్తుండగా.. ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామ శివారులోని చెరువు కట్టపై డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ట్రాక్టర్ కట్ట నుండి కిందకు పడిపోయింది.