సినిమాల కంటే రాజకీయాలకే ప్రాధాన్యత: జయసుధ

జయసుధ దాదాపు ఐదు దశాబ్దాల పాటు నటించారన్నారు. ఆమె రాక బీజేపీకి లాభమని, బీజేపీలో మరింత ఉత్సాహం

Update: 2023-08-02 13:21 GMT

ప్రముఖ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరుల సమక్షంలో ఢిల్లీలో ఆమె భారతీయ జనతా పార్టీ లో చేరారు. తరుణ్ చుగ్ కండువాను కప్పి పార్టీలోకి స్వాగతించారు. కులాలు, మతాలపరంగా కాకుండా తాను ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నానని, అందుకే బీజేపీలో చేరానని జయసుధ అన్నారు. తాను బీజేపీలో చేరడానికి ముఖ్య కారణం ప్రధాని నరేంద్ర మోదీ అని అన్నారు. ఆయన నాయకత్వంలో భారత్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఈ విషయాన్ని తాను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదన్నారు. తాను బీజేపీలో చేరానంటే చాలామందికి ఆశ్చర్యం వేయవచ్చని, కానీ కులాలపరంగా కాకుండా మంచి కోసం పని చేయాలని భావిస్తున్నానని చెప్పారు. బీజేపీలో చేరడంపై ఏడాదిగా చర్చలు జరుగుతున్నాయని, అమిత్ షాను కూడా కలిశామన్నారు. ప్రజలకు, పేదలకు సేవ చేయాలనే ఉద్ధేశ్యంతోనే బీజేపీని ఎంచుకున్నట్లు చెప్పారు. తాను సికింద్రాబాద్, ముషీరాబాద్‌ల నుండి పోటీ చేస్తాననేది కేవలం ప్రచారం మాత్రమే అన్నారు. తాను ఇక సినిమాల కంటే రాజకీయాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తానని చెప్పారు.

తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. జయసుధ దాదాపు ఐదు దశాబ్దాల పాటు నటించారన్నారు. ఆమె రాక బీజేపీకి లాభమని, బీజేపీలో మరింత ఉత్సాహం వస్తుందన్నారు. పేదల సంక్షేమం, బస్తీల అభివృద్ధి కోసం ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కృషి చేశారన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన, అవినీతి పాలన, నియంతృత్వ పాలన పోవాలని, ప్రజాస్వామ్య పాలన రావాలని యావత్ తెలంగాణ కోరుకుంటోందన్నారు.


Tags:    

Similar News