కాంగ్రెస్‌కు 'రెండు టికెట్ల' టెన్షన్
రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ అభ్యర్ధులను ప్రకటించింది. మిగిలిన ఐదు, ఆరు స్థానాల్లోనూ త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. బీజేపీ కూడా ఈ రోజే పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరింది.
రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ అభ్యర్ధులను ప్రకటించింది. మిగిలిన ఐదు, ఆరు స్థానాల్లోనూ త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. బీజేపీ కూడా ఈ రోజే పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరింది. ఇక ఈ మధ్య పరిస్థితి కాస్తా మెరుగు పరుచుకుని రాష్ట్రంలో అధికారంలోకి వస్తామంటున్న కాంగ్రెస్ ఇప్పటికే పోటీచేయాలనుకునే ఔత్సాహిక అభ్యర్ధుల నుంచి ధరఖాస్తులు స్వీకరించింది. మొత్తం 1000కి పైగా ధరఖాస్తులు రాగా.. అత్యధికంగా ఇల్లెందు నియోజకవర్గం నుంచి 38, అత్యల్పంగా జగిత్యాల్, కొడంగల్ నుంచి ఒక్కోటి చొప్పున దరఖాస్తులు వచ్చాయి. అభ్యర్ధుల ప్రకటనకై తుది కసరత్తు జరుగుతున్న వేళ ఆశ్చర్యకరమైన డిమాండ్లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మధ్య పెరిగిన గ్రాఫ్‌ను పడిపోకుండా క్యాష్ చేసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తుండగా.. నేతలు మాత్రం ఒకరిని మించి ఒకరు రెండు, మూడు టికెట్లు డిమాండ్ చేస్తూ లేనిపోని తలనొప్పిగా మారుతున్నారు.
రెండు కావాలంటున్న రేఖా నాయక్..
ఇటీవల బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో చోటు దక్కించుకోలేకపోయిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్.. కాంగ్రెస్‌లో చేరికకు సుముఖత వ్యక్తం చేసింది. అయితే.. తనకు, తన భర్త శ్యామ్ నాయక్‌కు టికెట్ కావాలనే ప్రతిపాదనను కాంగ్రెస్ నేతల ముందు ఉంచింది. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో ఎక్కువ మొత్తంలో సీట్లు గెలవాలని భావిస్తున్న కాంగ్రెస్‌కు.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి దూరమైన తర్వాత.. రేఖానాయక్ రూపంలో బలమైన నేత పార్టీలోకి రావడం కొంత మేర కలిసొచ్చే అవకాశం ఉంది. అయితే.. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వాళ్లకు మొండిచేయి చూపించలేని పరిస్థితి కూడా ఉంది.
బలరాం నాయక్ డిమాండ్..
మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ కూడా రెండు టికెట్లు డిమాండ్ చేస్తుండటం విశేషం. మహబూబాబాద్ నుంచి తాను బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతుండగా.. తనతో పాటు తన కుమారుడికి కూడా టికెట్ అడుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహబూబాబాద్ లో శంకర్ నాయక్ కు ఉన్న వ్యతిరేకతను.. తనకు అనుకూలంగా మార్చుకోవాలంటే చెమటోడ్చాల్సిన ఈ తరుణంలో మరో టికెట్ డిమాండ్‌తో ఉన్న అవకాశాలు సన్నగిల్లేలా చేసుకుంటున్నారనే విమర్శలు నియోజకవర్గం నుంచి వినవస్తున్నాయి.
కొండా కుటుంబం నుంచి...
తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఓ వెలుగు వెలిగిన ఓరుగల్లు ఆడబిడ్డ కొండా సురేఖ ఇంటి నుంచి కూడా రెండు టికెట్ల డిమాండ్ ఉంది. వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ పోటీలో ఉంటారనే ప్రచారం సాగుతుంది. అయితే.. కొండా ఫ్యామిలీ పరకాల, భూపాల పల్లి ల నుంచి ఓ స్థానం ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. సురేఖ భర్త కొండా మురళీ లేదా కూతురు సుస్మిత లలో ఎవరో ఒకరు ఈ రెండు స్థానాలలో ఒక చోటు నుంచి బరిలో నిలవాలని భావిస్తున్నట్లు.. ఈ డిమాండ్‌ను గాంధీ భవన్ కు చేరవేసినట్లు ప్రచారం జోరుగా సాగుతుంది.
కూతురితో పాటు తనకూ...
మరో సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా రెండు టికెట్లు ఆశిస్తున్నారని తెలుస్తోంది. తనతో పాటు తన కూతురికి కూడా టికెట్ అడిగారని సమాచారం. ఇటీవలే సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితునిగా నియమితుడైన రాజనర్సింహ పార్టీకి మొదటి నుంచి వీర విధేయుడు. ఈ నేపథ్యంలోనే అధిష్టానం తన అభ్యర్ధన పట్ల సానుకూలంగా స్పందిస్తుందనే.. మరో టికెట్ డిమాండ్ చేస్తున్నారనే గుసగసలు లేకపోలేదు.
ఇద్దరి కొడుకులకూ అంటున్న అంజన్ కుమార్ యాదవ్
ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్‌గా ఉన్న మరో సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా రెండు టికెట్ల డిమాండ్‌ను అధిష్టానం ముందు ఉంచినట్లు తెలుస్తోంది. పెద్ద కొడుకు అనిల్ కుమార్ యాదవ్ యాక్టివ్ పొలిటీషియన్‌గా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. మరో కొడుకు అరవింద్ కుమార్ యాదవ్ కోసం కూడా అంజన్ కుమార్ యాదవ్ టికెట్ అభ్యర్ధిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో పార్టీని వీడకుండా అంటిపెట్టుకుని ఉన్నారు. మరి వీరికి ఏమాత్రం అవకాశం లభిస్తుందో చూడాలి.
తనయుడు సూర్య కోసం సీతక్క పట్టు..
మావోయిస్టు టర్న్‌డ్ పొలిటీషియన్ సీతక్క కూడా తన కొడుకు సూర్య కోసం టికెట్ డిమాండ్ చేస్తోంది. సూర్య గత కొంత కాలంగా పినపాక నియోజకవర్గంలో గట్టిగా తిరుగుతున్నారు. అయితే పొంగులేటి వర్గానికి చెందిన పాయం వెంకటేశ్వర్లు ఇటీవల పార్టీలో చేరడంతో అవకాశాలు సన్నగిల్లాయి. అయితే.. రేవంత్ వర్గంలో కీలక నేతగా ఉన్న సీతక్కకు ప్రాధాన్యత ఇచ్చినా.. పినపాక సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగాను ఢీ కొట్టాలంటే పాయంతోనే సాధ్యమవుతుందనే వాదన వినవొస్తుంది. ఇక్కడి టికెట్ విషయంలో చివరి నిమిషం వరకూ ఉత్కంఠ తప్పదని అంతా భావిస్తున్నారు.
జానారెడ్డి కూడా..
మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కూడా తన ఇద్దరు కొడుకులు రఘువీర్, జైవీర్ ల కోసం టికెట్లు కావాలని అడుగుతున్నారు. కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న జానారెడ్డి సుదీర్ఘ కాలం మంత్రిగా పనిచేసిన రికార్డును సొంతం చేసుకున్నారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు, అంతర్గత కుమ్ములాటలు చోటుచేసుకున్న తరుణంలో నేతల మధ్య ఏకాభిప్రాయం కోసం తీవ్రంగా శ్రమించిన వ్యక్తిగా, వివాద రహితుడిగా పేరుంది. మరి జానారెడ్డి డిమాండ్ పట్ల ఎలాంటి సమాధానం వస్తుందనేది వేచి చూడాల్సిందే.
మైనంపల్లి వస్తే మాత్రం..
ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన జాబితాలో చోటు దక్కిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావుది విచిత్ర పరిస్థితి. తనతో పాటు తన కొడుకుకి కూడా టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్‌పై తిరుగుబాటు చేయడంతో ఉన్న టికెట్ కూడా కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. దీంతో కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరిపి.. రెండు టికెట్లు డిమాండ్ ను ముందుంచారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆ డిమాండ్‌కు సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నా.. ప్రస్తుతం మైనంపల్లి మాత్రం నియోజకవర్గంలో తిరుగుతూ ఏ పార్టీలో చేరాలనే విషయమై అనుచరులు, ప్రజలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక వీరు కాక ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మా ఉత్తమ్ రెడ్డి ఒకే కుటుంబం నుంచి రెండు స్థానాల్లో పోటీలో ఉండనున్నారు. మల్లు భట్టీ విక్రమార్క కుటుంబం నుంచి కూడా ఆయన సోదరుడు మల్లు రవి కూడా టికెట్ రేసులో ఉన్నారు.
అయితే.. అశావహులందరికీ టికెట్లు ఇచ్చే పరిస్థితి ఏ పార్టీలోనూ ఉండదు. ఇందుకు కాంగ్రెస్ మినహాయింపు కాదు. వచ్చిన అవకాశాన్ని సరిగా వినియోగించుకుని పార్టీ అధికారంలోకి వస్తే ఇతరత్రా అవకాశాలు ఎన్నో ఉంటాయని.. మొన్న అవకాశం లభించని నేతలకు కేసీఆర్ అదే చెప్పారూ.. కాంగ్రెస్ పార్టీలోని నేతలకు కూడా అగ్ర నాయకత్వం అదే ఉపదేశిస్తుంది. అయితే నేతలు ఎంతవరకూ అధిష్టానం నిర్ణయంతో సమాధానపడుతారనేది టికెట్ల ప్రకటన తర్వాత తేలనుంది.
ఈ పంచాయితీ ఇలా ఉంటే కార్యకర్తలు, కేడర్ మాత్రం.. త్వరగా అభ్యర్ధులను ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని, రాష్ట్ర అగ్ర నాయకత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న జోష్‌ను పోలింగ్ బూత్ వరకూ తీసుకెళ్లాలంటే ఏమాత్రం తాత్సారం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. నేతల టికెట్ల లొల్లికి, కార్యకర్తల ఎదురు చూపులకు ఎప్పుడు తెర పడుతుందో చూడాలి..!