వరదలో గల్లంతైన మృతదేహాలు లభ్యం
మరోవైపు ఎత్తైన ప్రాంతంలో ఉన్న గ్రామస్తులు త్రాగునీరు, తిండిలేక అలమటిస్తున్నారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో
ములుగు జిల్లా వరదలలో గల్లంతైన వారిలో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు. ఏటూరు నాగారం మండలం కొండాయిలో ఉన్న జంపన్నవాగులో గురువారం (జులై27) 8 మంది గల్లంతయ్యారు. జంపన్నవాగు ఉగ్రరూపం దాల్చి కొండాయిని ముంచెత్తడంతో పలువురు గల్లంతయ్యారు. గ్రామప్రజలు ప్రాణాలను కాపాడుకునేందుకు ఎత్తైన ప్రదేశాలకు తరలివెళ్లారు. ఈ క్రమంలోనే 8 మంది గ్రామస్తులు వాగు ప్రవాహంలో గల్లంతయ్యారు. వారిలో ఐదుగురి మృతదేహాలు తాడ్వాయి మండలం మేడారం వద్ద లభ్యమయ్యాయి. మరో ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉంది.
మరోవైపు ఎత్తైన ప్రాంతంలో ఉన్న గ్రామస్తులు త్రాగునీరు, తిండిలేక అలమటిస్తున్నారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో వారికి సహాయం అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లేందుకు ఆలస్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు. హన్మకొండ జిల్లా వేలేరు మండలం కన్నారం మత్తడివాగులో నిన్న బైక్ తో సహా గల్లంతైన పొన్నాల మహేందర్ (32) అనే వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మోరంచపల్లి గ్రామంలో సంభవించిన వరదల్లో గల్లంతైన నలుగురి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. మరోవైపు వరంగల్ జిల్లాలో మళ్లీ కుండపోత వర్షం మొదలైంది. భారీ వర్షం కారణంగా పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్థన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. పంతిని ఊరచెరువు 5 అడుగుల ఎత్తులో ప్రవహిస్తుండటంతో.. వరంల్ - ఖమ్మం రహదారి పై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.