Hyderabad : ఏడేళ్ల తర్వాత కలిసిన చంద్రబాబు, రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు ఏడేళ్ల తర్వాత ముఖాముఖి కలిశారు

Update: 2024-07-06 13:13 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు ఏడేళ్ల తర్వాత ముఖాముఖి కలిశారు. 2017లో రేవంత్ రెడ్డి విజయవాడకు వెళ్లి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. అప్పడు చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. విజయవాడ వెళ్లి మరీ ఆయన పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు రేవంత్ ప్రకటించారు. అది అప్పట్లో చర్చనీయాంశమైంది. స్పీకర్ కు ఇవ్వకుండా చంద్రబాబుకు రాజీనామా లేఖ ఇవ్వడమేంటని కొందరు ప్రశ్నించారు. ఆ తర్వాత స్పీకర్ ఫార్మాట్ లో కొడంగల్ ఎమ్మెల్యే పదవికి 2017లో ఆయన రాజీనామా చేశారు.

2017లో రాజీనామా చేసిన...
అయితే 2018 ఎన్నికల్లో మహాకూటమిలో తెలుగుదేశం పార్టీ చేరడంతో ఇక్కడకు ప్రచారానికి చంద్రబాబు వచ్చారు. రాహుల్ గాంధీతో కలసి హైదరాబాద్ నగరంలో ప్రచారంలో కూడా పాల్గొన్నారు. అయితే 2017 తర్వాత రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరూ ముఖాముఖి కలిసిన సందర్భాలు లేవు.ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. 2018 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. అక్కడ 2019 లో టీడీపీ పవర్ లోకి రాలేదు. దీంతో ఎవరి రాష్ట్రంలో వారు ఉండిపోయారు. కలుసుకునే అవకాశాలు కూడా లేదు. ఇప్పుడు తాజాగా ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రేవంత్ ముఖ్యమంత్రి అవ్వడం, అక్కడ టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో ఇద్దరు ఏడేళ్ల తర్వాత ముఖ్యమంత్రుల హోదాలో తొలిసారి కలిశారు.


Tags:    

Similar News