ప్రయివేటు సంస్థ ద్వారా...
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయివేటు సంస్థ ద్వారా సర్వేను నిర్వహించారు. ఇందులో డేంజర్ జోన్ లో ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తేలింది. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ 65 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపొందగా, అందులో 26 మంది ఎమ్మెల్యేల పనితీరు అద్వాన్నంగా ఉందని తేలడంతో రేవంత్ రెడ్డి ఒకింత సీరియస్ గానే ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేవలం కాంగ్రెస్ మాత్రమే కాకుండా బీఆర్ఎస్, బీజేపీ వంటి ప్రతిపక్షాలకు చెందిన నియోజకరవర్గాల్లోనూ ఈ సర్వే నిర్వహించారని చెబుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కానీ, వారి వద్దకు వెళ్లి నియోజకవర్గ సమస్యలను పరిష్కరించడంలో కానీ 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తేలిందన్న సమాచారం కాంగ్రెస్ లో కలకలం రేపుతుంది.
మంత్రులు కూడా...
అయితే ఇందులో 26 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లోనూ, 14 మంది ఆరెంజ్ జోన్ లోనూ, మిగిలిన ఎమ్మెల్యేలు సేఫ్ జోన్ లో ఉన్నారని సర్వేలో తేలినట్లు తెలిసింది. అలాగే ఇందులో కొందరు మంత్రులు కూడా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు సర్వేలో వెల్లడయింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు సర్వేలో స్పష్టం కావడంతో వారికి సర్వే నివేదికలను ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమయినట్లు తెలిసింది. వారిపై వినిపించే ఆరోపణలను వారి దృష్టికి తీసుకెళ్లి సరైన పంథాలో నడిపించేందుకు ప్రయత్నాలు చేయనున్నారని సమాచారం. ఎక్కువ మంది హైదరాబాద్ కే పరిమితమై వ్యాపారాలపై దృష్టి పెట్టడం వల్ల నియోజకవర్గాల్లో పనితీరు బాగాలేదని తేలినట్లు తెలిసింది.
మరికొందరు ఆరెంజ్ జోన్ లో...
కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్రమ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు కూడా ఈ సర్వేలో వెల్లడయినట్లు సమాచారం. వీరిలో కొందరు ఎమ్మెల్ేలు ఇసుక అక్రమ రవాణా, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చేతులు పెట్టడమే కాకుండా తమ అనుచరులకు పనులు కట్టబెడుతూ అవినీతికి పాల్పడుతున్నారని కూడా సర్వేలో తెలిసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆరెంజ్ జోన్ లో ఉన్న ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమై, పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు సర్వేలో తేలిందని చెబుతున్నారు. దావోస్ పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ ఎమ్మెల్యేలతో సమావేశాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.