Caste Census : తెలంగాణలో కులగణన ఎంత వరకూ వచ్చిందయ్యా..అంటే?
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన కార్యక్రమం దాదాపుగా పూర్తి కావచ్చింది
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన కార్యక్రమం దాదాపుగా పూర్తి కావచ్చింది. బీసీల కోసం ఈ కులగణన కార్యక్రమాన్ని కాంగ్రెస్ సర్కార్ ప్రారంభించింది. నవంబరు 6వ తేదీన ఈ కులగణన సర్వే ప్రారంభమయింది. అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు కల్పించే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి గ్రామీణ ప్రాంతాల్లో మంచి స్పందన లభించినా, హైదరాబాద్ నగరంలో మాత్రం అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ఇంకా కులగణన కార్యక్రమం పూర్తిగా ఎండ్ కాలేదు. సర్వే వివరాలను సేకరించే పనిలో సిబ్బంది ఉన్నారు. ఉపాధ్యాయులు, కొందరు నియమితులైన వారిచేత ఈ ప్రత్యేక సర్వేను చేయిస్తున్నారు. అయితే హైదరాబాద్ నగరంలో ఆశించినంత స్థాయిలో మాత్రం కులగణన సర్వే జరగడం లేదు.
డేటా ఎంట్రీతో సహా...
అయితే మంగళవారం నాటికి తెలంగాణలో కులగణన 94.9 శాతం పూర్తయిందని అధికారులు తెలిపారు. కేవలం 27 రోజుల్లో 1,11, 488 కుటుంబాల గణనను పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో దాదాపు ఎనభై లక్షలకు సంబంధించి కులగణన సర్వే వివరాలను డేటా ఎంట్రీ కూడా పూర్తయింది. అంటే మంగళవారం వరకూ 67.8 శాతం డేటా ఎంట్రీ పూర్తయింది. అయితే తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో కులగణన సర్వేకు ప్రజలు సహకరిస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. తమ వివరాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చెబుతున్నారు. కానీ సిటీలో మాత్రం ఫ్రిజ్ ఉందా? కారు ఉందా? సొంత ఇల్లు ఉందా? ద్విచక్ర వాహనం ఉందా? అనే వివరాలను మాత్రం చెప్పడానికి హైదరాబాద్ లో ప్రజలు చెప్పేందుకు ఇష్టపడటం లేదు.
రాష్ట్రంలో వందశాతం పూర్తయిన...
తెలంగాణలో మొత్తం 33 జిల్లాలుండగా మంగళవారం వరకూ పదిహేను జిల్లాల్లో వంద శాతం కులగణన సర్వే పూర్తయింది. ములుగు, నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, జనగాం, ఖమ్మం, నల్గొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, మహబూబాబాదు, పెద్దపల్లి, మెదక్, వనపర్తి, కుమరంభీం ఆసిఫాబాద్, భద్రాచలం కొత్తగూడెం జిల్లాలు వంద శాతం సర్వే పూర్తయిందని అధికారులు తెలిపారు. మిగిలిన జిల్లాల్లో కూడా త్వరితగతిన సర్వే పూర్తి చేసి డేటా ఎంట్రీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో మాత్రం పూర్తి స్థాయి వివరాలు మాత్రం అందడం లేదని, ఇంకా కొంతకాలం పట్టే అవకాశముందని అధికారులు వెల్లడించారు.