Kodandaram : పెద్దాయన ఎన్నాళ్లకు పెద్దల సభలోకి?

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ ఎట్టకేలకు శాసనమండలి సభ్యుడయ్యారు.

Update: 2024-08-16 06:05 GMT

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ ఎట్టకేలకు శాసనమండలి సభ్యుడయ్యారు. గవర్నర్ కోటాలో కోదండరామ్, అమీర్ ఆలీఖాన్ లతో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ కోటాలో ఈ ఇద్దరు ఎమ్మెల్సీలుగా బాధ్యతలను చేపట్టారు. కాగా కోదండరామ్ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత దాదాపు పదకొండేళ్ల పాటు పదవి కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. ఆయన ఎమ్మెల్సీ, రాజ్యసభ కు ఏదో పదవికి ఎంపిక అవుతారని తెలంగాణ రాకముందు అందరూ అంచనా వేశారు. అయినా అనేక కారణాలతో ఆయన పదవికి దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది.

కీలక పాత్ర పోషించి...
తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరామ్ ది కీలక పాత్ర. జేఏసీ ఛైర్మన్ గా ఆయన అన్ని పార్టీలను ఏకతాటిపై నడిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉన్న కోదండరామ్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. నాటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచన మేరకు ఉద్యమ నాయకత్వాన్ని అందుకున్నారు. ఒకవైపు రాజకీయ పోరాటం చేస్తూనే, మరొక వైపు తెలంగాణలో క్షేత్రస్థాయిలో ఉద్యమ వేడి రగిలించడానికి ప్రొఫెసర్ కోదండరామ్ పాత్ర విలువ కట్టలేనిది. ప్రతి గ్రామం తిరిగారు. ప్రజలను చైతన్య వంతుల్ని చేశారు. ఉద్యమం అవసరాన్ని ప్రజలకు వివరించి వారిని రహదారులపైకి తీసుకు రావడంలో సక్సెస్ అయ్యారు.
రాష్ట్రం ఆవిర్భవించినా...
చివరకు అందరి కృషి ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరామ్ ను ఉపయోగించుకుని నాటి టీఆర్ఎఎస్ నేత కేసీఆర్ తాను అధికారంలోకి వచ్చినా పెద్దాయనను మాత్రం పక్కన పెట్టేశారు. ఎందుకో తెలియదు కానీ ఆయనకు ఏపదవి ఇవ్వకుండా కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా అవమానపర్చారు. అలాంటి సమయంలో ప్రొఫెసర్ కోదండరామ్ కేసీఆర్ కు వ్యతిరేకంగా గళమెత్తారు. 2014, 2018 ఎన్నికల్లో కోదండరామ్ కేసీఆర్ కు వ్యతిరేకంగా తిరిగి ప్రజలను చైతన్య వంతుల్ని చేసేందుకు ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ తో కనెక్ట్ అయ్యారు.
కొత్త పార్టీ పెట్టి...
ఈ నేపథ్యంలోనే ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ జనసమితి పేరుతో పార్టీని స్థాపించారు. ఆ పార్టీని కూడా ప్రజలు ఆదరించలేదు. అన్ని రకాల బలాలు ఉంటేనే రాజకీయాల్లో రాణించగలుగుతారు. కానీ కోదండరామ్ కు ఆర్థికంగా రాజకీయ పార్టీని నడిపే శక్తి లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పొచ్చు. అయినా 2023 ఎన్నికల్లో కోదండరామ్ కాంగ్రెస్ కు బేషరతుగా మద్దతు ఇచ్చారు. తన పార్టీ పోటీ చేయకుండా కాంగ్రెస్ కు మద్దతిచ్చిన ఆయనకు ఏదో ఒక పదవి ఇస్తామని పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే గవర్నర్ కోటాలో ఆయన పేరును పంపినా, దాసోజు శ్రావణ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వీలవ్వలేదు. న్యాయస్థానం స్పష్టమైన తీర్పు చెప్పడంతో మరోసారి తెలంగాణ మంత్రి వర్గం సమావేశమై గవర్నర్ కోటాలో ఆయన పేరును పంపడం, ఓకే చేయడం అయిపోయింది. రాష్ట్రం ఆవిర్భవించిన 11 ఏళ్లకు పెద్దల సభలోకి అడుగు పెట్టారు.


Tags:    

Similar News