ఎక్కడైనా చూపిస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా: తలసాని
తెలంగాణలో ఇరు పార్టీల మధ్య రోజుకో విధంగా మాటల యుద్దాలు కొనసాగుతూనే ఉంటాయి. తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్..
తెలంగాణలో ఇరు పార్టీల మధ్య రోజుకో విధంగా మాటల యుద్దాలు కొనసాగుతూనే ఉంటాయి. తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రతిపక్షాలు మాత్రం డబుల్ బెడ్ రూమ్‌లపై ఎన్నో ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా డబుల్ బెడ్ రూమ్‌లు ఇచ్చింది లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ప్రభుత్వం ఇప్పటికే వేలాది ఇళ్లను పేద, మధ్యతరగతి ప్రజలకు పంపిణీ చేసింది. ఈ క్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న విధంగా దేశంలో ఎక్కడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం జరగట్లేదని, ఎక్కడైనా నిర్మించినట్లు చూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తా అంటూ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పారదర్శకంగా ఇళ్ల పంపిణీ జరుగుతుందని అన్నారు. పైరవీలు, అవినీతికి తావు లేకుండా ప్రభుత్వం పేద వాళ్ల కోసం పనిచేస్తుందన్నారు.
అయితే గతంలో కూడా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై ఛాలెంజ్ విషయంలో ఇలానే వ్యవహరించారు. కాంగ్రెస్ ఎల్పీ నేత భట్టి విక్రమార్కకు సవాల్ విసిరిన తలసాని తన కార్‌లోనే డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతాలకు తీసుకెళ్లి చూపించారు. ఈ క్రమంలోనే తాజాగా డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో రాజీనామా సవాల్ విసరడం ఆసక్తికరంగా మారింది.