బీఆర్‌ఎస్‌కు షాకివ్వనున్న ఎమ్మెల్యే రాజయ్య!

తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ..

Update: 2023-09-05 05:56 GMT

BRS MLA Rajaiah

తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ పార్టీలు దూకుడు పెంచాయి. ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో కొందరికి టికెట్‌ దక్కలేదు. వారంతా కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టికెట్‌ కోల్పోయిన వారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. అలాగే అసంతృప్తితో ఉన్న బీఆర్‌ఎస్ అభ్యర్థులకు కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు గాలం వేస్తున్నాయి. ఇక బీఆర్ఎస్‌లో టికెట్ దక్కని వారరిలో స్టేషన్‌ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య ఒకరు. ఆయన కొద్ది రోజులుగా అసంతృప్తితో ఉన్నారు. సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన తెలంగాణ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్‌లో తన పేరు లేకపోవడంతో కన్నీటి పర్యంతమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజయ్య అనుచరులు, కార్యకర్తలతో కలిసి సమావేశాలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే రాజయ్య కాంగ్రెస్‌లో చేరుతున్నారనే టాక్‌ కూడా వినిపిస్తోంది.

తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రాజయ్య భేటీ అయ్యారు. హనుమకొండ నయీమ్ నగర్‌లోని ఓ హోటల్లో ఇద్దరు నేతలు కలిసినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని తాజా రాజకీయాల పరిస్థితులపై చర్చలు జరిపారు. ఇదే సమయంలోపార్టీలో చేరిక, టికెట్‌పై మాట్లాడినట్లు సమాచారం. అయితే హనుమకొండలో దళిత మేధావుల సదస్సు నిర్వహించేందుకు దామోదర రాజనర్సింహ అక్కడకు వెళ్లారు. ఇదే సదస్సుకు ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ నేతతో రాజయ్య కలిసి మాట్లాడడంతో.. కాంగ్రెస్ చేరడం లాంఛనమేననే పుకార్లు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటూ రాజయ్య వర్గీయులు చెబుతున్నారు.

అయితే బీఆర్ఎస్‌లో సీటు దక్కన ఆశావాహులంతా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్, బీజేపీ వైపు చూస్తున్నారు. ముహూర్తం చేసుకుని చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ నేత తుమ్మల నాగేశ్వరరావు సైతం త్వరలోనే కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకుంటారని సమాచారం. ఇప్పటికే ఆయనను పలు మార్లు కాంగ్రెస్‌ సీనియర్ల కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదే బాటలో రాజయ్య కూడా పయనిస్తారని కార్యకర్తలు, అభిమానులు భావిస్తున్నారు. మరి రాజయ్య కాంగ్రెస్‌లో చేరుతారా..? లేదా అన్నదా వేచి చూడాలి.


Tags:    

Similar News