Cold Winds : చలిగాలులు చంపేస్తున్నాయ్...బయటకు రావడానికి భయపడిపోతున్న జనం
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. చలి గాలులతో జనం వణికిపోతున్నారు
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. చలి గాలులతో జనం వణికిపోతున్నారు. ఉదయం పది గంటలకు కూడా ప్రజలు బయటకు రావడానికి భయపడిపోతున్నారు. చలి దెబ్బకు అనేక వ్యాపారాలు కూడా మూతబడ్డాయి. ఉదయాన్నే మార్నింగ్ వాక్ కు వెళ్లే వాళ్లు కూడా చలిని తట్టుకోలేక బయటకు రావడం లేదు. గతంలో కన్నా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు ఉదయం పది గంటల వరకూ బయటకు రాలేక అవస్థలు పడుతున్నారు.
అనేక వ్యాధులతో...
చలి దెబ్బకు అనేక మంది అనారోగ్యానికి గురవుతున్నారు. శ్వాసకోశ వ్యాధులతో ఎక్కువమంది ఇబ్బంది పడుతున్నారని, జలుబు, దగ్గు సమస్యలతో ఎక్కువ మంది ఆసుపత్రులకు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. చలితో పాటు చలిగాలులు వీస్తుండటంతో అనేక రకమైన జబ్బులు వస్తాయని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బందులు పడతారని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే అనేక వ్యాధులతో వస్తున్న రోగులతో ఆసుపత్రులన్నీ కిటికిటలాడిపోతున్నాయి.
ఏజెన్సీ ప్రాంతంలో...
ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో చలి మరింత పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. కొమురం భీం జిల్లాలో 10.5 డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయింది. ఆదిలాబాద్ జిల్లాలో 11.2 డిగ్రీలు.. నిర్మల్ జిల్లాలో 12.8గా, మంచిర్యాల జిల్లాలో 13.2గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే ఏపీలోని అల్లూరి సీతారామ జిల్లాలోని అరకు లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో పర్యాటకులు కూడా ఇబ్బంది పడుతున్నారు.