లౌకిక వ్యతిరేక శక్తులపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది
ఎన్ని సవాళ్లు ఎదురైనా, తెలంగాణలో లౌకికవాదాన్ని, మత సహనాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు.
ఎన్ని సవాళ్లు ఎదురైనా, తెలంగాణలో లౌకికవాదాన్ని, మత సహనాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. లౌకిక వ్యతిరేక శక్తులపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. మంగళవారం రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలు ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలని, భగవంతుని ఆశీస్సుల కోసం ప్రార్థనలు చేయాలని ఆయన ఆకాంక్షించారు.
మానవాళికి సేవ చేయాలనే విశ్వవ్యాప్త సందేశాన్ని రంజాన్ వ్యాప్తి చేస్తుందని, పవిత్ర రంజాన్ మాసంలో క్రమం తప్పకుండా ఉపవాసం, ప్రార్థనలు చేయడం క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని, ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగిస్తుందని అన్నారు. గంగా జమునీ తహజీబ్ సంస్కృతిని ప్రతిబింబించే తెలంగాణ.. దేశంలో లౌకికవాదాన్ని, మత సహనాన్ని బలోపేతం చేయడంలో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ముస్లిం సమాజ శ్రేయస్సు కోసం అత్యంత నిబద్ధతతో కృషి చేస్తోందన్నారు.
రాష్ట్రంలోని ముస్లింల సామాజిక-ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం భారీ నిధులను కేటాయించి, విదేశీ విద్య స్కాలర్‌షిప్‌లు, గురుకుల రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలతో సహా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసిందని రంజాన్ సందేశంలో పేర్కొన్నారు.