ఓటమి భయంతోనే ఈ డ్రామాలు

మునుగోడులో ఓటమి తప్పదని గ్రహించి కొత్త డ్రామాకు టీఆర్ఎస్ తెరలేపిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు

Update: 2022-10-27 07:00 GMT

మునుగోడులో ఓటమి తప్పదని గ్రహించి కొత్త డ్రామాకు టీఆర్ఎస్ తెరలేపిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ ప్రచారం చేసి పబ్బం గడుపుకోవాలని అధికార టీఆర్ఎస్ చూస్తుందన్నారు. ఎంత డబ్బు దొరికింది? ఎక్కడి నుంచి వచ్చిందన్న సమాచారం ఎక్కడ ఉంది? అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను, కార్పొరేటర్లను ఎవరు కొనుగోలు చేశారు అని ఆయన ప్రశ్నించారు. కనీసం వారి చేత రాజీనామాలు చేయించి తిరిగి ఎన్నికలకు వెళ్లిన చరిత్ర టీఆర్ఎస్ కు ఉందా? అని ఆయన నిలదీశారు. నాలుగు వందల కోట్లు వెచ్చించి కొనుగోలు చేయగలిగిన నేతలా? వాళ్లు అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తమ వద్ద విమానాలు కొనేంత డబ్బులు లేవన్నారు.

డ్రామా బూమరాంగ్...
నిజంగా ఫామ్ హౌస్ లో డీల్ జరిగితే ఇంత వరకూ ఎందుకు సాక్షాలు బయటపెట్టలేదు అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మునుగోడు ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ డ్రామా ఆడిందని కేంద్ర మంత్రి అన్నారు. వింతనాటకాలకు తెరతీసి డైవర్ట్ చేయాలని భావిస్తున్నారన్నారు. ఫిరాయింపులు ప్రోత్సహించి పదవుల ఇచ్చింది టీఆర్ఎస్ కాదా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబం ఫ్రస్టేషన్ లో ఉందని, అధికారం పోతుందన్న భయంతో ఇలాంటి దిగజారుడు చర్యలకు దిగుతుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ డ్రామా చివరకు బూమరాంగ్ అయిందన్నారు. ఫాంహౌస్ లో పోలీసులు రాకముందే టీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఎలా పోస్టులు వచ్చాయని ఆయన నిలదీశారు.


Tags:    

Similar News