ముందస్తు ఎన్నికలు రావు.. అంత దమ్ములేదు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ కు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేదన్నారు. ముందస్తు ఎన్నికలు తెలంగాణలో రావన్నారు. అంత దమ్ము కేసీఆర్ కు లేదని షర్మిల అన్నారు. కేసీఆర్ తన కుమార్తెను లిక్కర్ స్కాంలో కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయనకు దేశ రాజకీయాలను ప్రభావితం చేసేంత సీన్ లేదని చెప్పారు. బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితిగా షర్మిల అభివర్ణించారు. తన పాలనపై నమ్మక ముంటే మునుగోడులో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఎమ్మెల్యేను ఎందుకు పెట్టారని షర్మిల ప్రశ్నించారు.
మునుగోడు దత్తత...
మంత్రి కేటీఆర్ మునుగోడును దత్తత తీసుకుంటానని చెబుతున్నాడని, అది ఏమైనా పక్క రాష్ట్రంలో ఉందా? అని షర్మిల ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్దయెత్తున అవినీతి జరిగిందని ఆమె అన్నారు. అద్భుతమైన ప్రాజెక్టు అంటూ అద్భుతంగా మోసం చేశాడని ఆమె విమర్శించారు. కేసీఆర్ కమీషన్ల కోసమే ప్రాజెక్ట్ ల రీ డిజైన్లకు పూనుకున్నారని షర్మిల అన్నారు. దేశంలోనే అతి పెద్ద స్కాంగా షర్మిల అభివర్ణించారు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికే ప్రాజెక్టులను రీ డిజైన్ చేశారన్నారు. తాను కాళేశ్వరంపై ఢిల్లీకి వెళ్లి సీబీఐకి ఫిర్యాదు చేశామని, కాగ్ కు కూడా నివేదిక ఇచ్చామని తెలిపారు. రేవంత్ రెడ్డి మీడియా హౌస్ లను మెయిన్‌టెయిన్ చేస్తూ నెట్టుకొస్తున్నారని ఫైర్ అయ్యారు.