2000 నోటు గురించి చాన్నాళ్లుగా ప్రజల్లో నడుస్తున్న ఊహాగానాలే నిజమని తేలుతున్నాయి. 2000 నోటును కొంతకాలం తర్వాత రద్దు చేసేస్తారని, నల్లకుబేరులు ఆ నోట్లు దాచిపెట్టుకుంటే.. అప్పుడు మళ్లీ ఇబ్బందులు పడక తప్పదని.. పలు ఊహాగానాలు చాలా రోజులుగా నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆరెస్సెస్ సిద్ధాంతకర్తల నోటినుంచి కూడా అలాంటి మాటలే వెలువడుతున్నాయి. నోట్ల రద్దు వలన ఏర్పడిన సంక్షోభాన్నించి గట్టెక్కడానికి 2000 నోటు అనేది ఓ అవసరార్థ తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని ఆరెస్సెస్ సిద్ధాంతకర్త గురుమూర్తి అంటున్నారు. ఒకసారి పరిస్థితులు మొత్తం సాధారణ స్థితికి వచ్చిన తరువాత.. క్రమంగా దానిని రద్దు చేయడం జరుగుతుందని ఆయన చెబుతున్నారు.
500, 1000 నోట్లను ఒక్కసారిగా రద్దు చేసేసిన తర్వాత.. హఠాత్తుగా ఏర్పడిన కొరతను పూడ్చడానికి డిమాండ్ – సప్లయి సూత్రాన్ని అనుసరించి మాత్రమే 2000 నోటును తీసుకువచ్చినట్టు ఇండియా టుడే న్యూస్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలు గురుమూర్తి వెల్లడించారు. క్రమంగా.. 2000 రూపాయల నోట్లను బ్యాంకుల్లోనే ఉంచేసుకుని, ప్రజలకు చిల్లర నోట్లు ఇవ్వాల్సిందిగా.. బ్యాంకులనే ఆదేశించడం జరుగుతుందని కూడా ఆయన తన అంచనాను వివరించారు.
‘‘తమ వద్దకు వచ్చిన 2000 నోట్లను తిరిగి ఇవ్వవద్దని బ్యాంకులకు ఆదేశిస్తారు. క్రమంగా వారి వద్ద 2000 నోట్ల నిల్వ పెరుగుతుంది. అవి తెచ్చిన ప్రజలకు చిల్లర నోట్లను ఇస్తారు. ఆ రకంగా క్రమేణా ప్రభుత్వం బహుశా 2000 నోట్లను అధికారికంగా రద్దు చేయడం వంటి నిర్ణయం తీసుకోకుండానే.. క్రమేపీ వాటిని చెలామణీకి దూరం చేసేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
భాజపా కు నిత్యం మార్గదర్శనం చేస్తూ ఉంటుందని విపక్షాలు విమర్శిస్తూ ఉండే ఆరెస్సెస్ సిద్ధాంతకర్తల్లో ఒకరైన గురుమూర్తి వెల్లడిస్తున్న అభిప్రాయాలు, అప్రకటిత అధికారిక సమాచారం లాంటిదే అని పలువురు భావిస్తున్నారు.