Karnataka results : ముంచింది మొత్తం ఈయనే
కర్ణాటకలో బీజేపీ ఓటమికి ప్రధాన కారణం బీఎల్ సంతోష్. ఆయనే ఓటమి బాధ్యతను తీసుకోవాలంటున్నారు కమలనాధులు;
కర్ణాటకలో బీజేపీ ఓటమికి ప్రధాన కారణం బీఎల్ సంతోష్. ఆయనే ఓటమి బాధ్యతను తీసుకోవాలంటున్నారు కమలనాధులు. కన్నడ రాజకీయాల్లో బీఎల్ సంతోష్ కొన్నాళ్లుగా కెలుకుతూ ఉండటం కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందని చెబుతున్నారు. యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి దించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. అంతే కాదు లింగాయత్ సామాజకవర్గంపై అనవసర వ్యాఖ్యలు చేసి వారిని దూరం చేశారన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. దీంతో పాటు అభ్యర్థుల ఎంపికలో కూడా బీఎల్ సంతోష్ వేలు పెట్టడం, కొందరు ముఖ్యులకు సీట్లు దక్కకపోవడంలో కాంగ్రెస్‌లోకి వెళ్లారు.
లింగాయత్‌లను...
అందులో జగదీష్ శెట్టర్ లాంటి నేత ఒకరు. కర్ణాటకలో లింగాయత్‌లతో పాటు దళిత ఓటు బ్యాంకు కూడా ఎక్కువ. అయితే దళితులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదు. మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉండటంతో దళిత ఓటు బ్యాంకు కూడా కాంగ్రెస్ కు గంపగుత్తగా పడింది. ఈ రెండు సామాజికవర్గాలను బీఎల్ సంతోష్ నిర్లక్ష్యం చేశారంటున్నారు. కర్ణాటక బీజేపీలో బీఎల్ సంతోష్ లింగాయత్ నాయకత్వాన్ని నిర్లక్షం చేశారన్న ఆరోపణలున్నాయి. కనీసం పార్టీ కార్యాలయంలోకి లింగాయత్ నేతలకు ఎంట్రీ కూడా లేదన్న కారణంతో వారు ఆగ్రహంగా ఉన్నారు.
మఠాధిపతులు...
దీంతోనే లింగాయత్ వర్గానికి చెందిన మఠాధిపతులు బహిరంగగానే బీజేపీకి వ్యతిరేకంగా ఓటు చేశారు. లింగాయత్ సామాజికవర్గానికి చెందిన పెద్దలు కూడా చివరి నిమిషంలో బీజేపీకి ఓటు వేయవద్దని పిలుపు నివ్వడం కూడా బీజేపీ దారుణ ఓటమికి కారణమయింది. బీఎల్ సంతోష్ ఆర్ఎస్‌ఎస్ నుంచి వచ్చిన నేత. కర్ణాటకలోని ఉడిపి ప్రాంతానికి చెందిన వారు. ఆయన మోదీ, అమిత్ షాలకు అత్యంత సన్నిహితుడిగా మారారు. అందువల్లనే ఆయన హవా కర్ణాటకలో కొనసాగింది. ప్రభుత్వంలోనూ ఆయన చికాకు కల్పించారన్న వాదనలు లేకపోలేదు.
కెలకడంతోనే...
కర్నాటక ప్రాంతానికి చెందిన బీఎల్ సంతోష్ సహజంగానే కర్ణాటకలో వేలు పెట్టి సర్వనాశనం చేశాడని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన నిర్ణయాలు, పార్టీ అధినాయకత్వానికి తప్పుడు నివేదికలు పంపడం, ముఖ్యమంత్రులను మార్చడం, అభ్యర్థుల ఎంపిక ఇవన్నీ బీఎల్ సంతోష్ నిర్వాకం కారణంగానే జరిగాయని నమ్ముతున్నారు. అందుకే ఇప్పుడు కన్నడ కమలం నేతలందరూ బీఎల్ సంతోష్ ను తిట్టిపోస్తున్నారు. ఇప్పటికైనా సంతోష్ జోక్యం ఉండకూడదని వారు కోరుకుంటున్నారు. ఇలా చివరకు కన్నడ రాష్ట్రంలో కమలం పార్టీని ముంచింది బీఎల్ సంతోష్ అనే టాక్ బలంగా వినిపిస్తుంది.