175 మాట దేముడెరుగు... కొట్టుకుంటున్నారు చూడు

ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి కార్యాలయంలో కూర్చుని 175 సీట్లు ఖచ్చితంగా వస్తాయంటున్నారు. ఎందుకు రావు అని ప్రశ్నిస్తున్నారు.

Update: 2022-06-11 05:52 GMT

ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి కార్యాలయంలో కూర్చుని 175 సీట్లు ఖచ్చితంగా వస్తాయంటున్నారు. ఎందుకు రావు అని ప్రశ్నిస్తున్నారు. కానీ నియోజకవర్గాల్లో నేతలు కొట్టుకు ఛస్తున్నారు. వైసీపీ క్యాడర్ రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటుంది. 175 నియోజకవర్గాల్లో దాదాపు వంద నియోజకవర్గాల్లో ఇదే పరిస్థిితి. ఎంపీకి, ఎమ్మెల్యేకు పడటం లేదు. ఎమ్మెల్యేకు, ద్వితీయ శ్రేణి నేతలకు పడటం లేదు. ఎవరి రాజ్యం వారిదే. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తుంటే 175 ఎక్కడ? 17 సీట్లు వచ్చేది గగనమేనన్న వ్యాఖ్యలు పార్టీ నేతల నుంచే వినపడుతున్నాయి.

గడప గడపకు ప్రభుత్వం....
గడప గడపకు ప్రభుత్వం కాదని, తొలుత నియోజకవర్గాలలో నేతల మధ్య నెలకొన్న విభేదాలపై జగన్ దృష్టి పెట్టాలని పార్టీ అభిమానులు కోరుకుంటున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఆధిపత్యపోరు నడుస్తుంది. ఏ పార్లమెంటు సభ్యుడు సంతృప్తి కరంగా లేరు. వారిని ఎంపీలుగా అస్సలు పట్టించుకోవడం లేదు. ఎంపీలు అసంతృప్తితో రగలిపోతున్నా, ఎమ్మెల్యేలు చీదరించుకుంటున్నట్లు అధినాయకత్వానికి తెలిసినా పట్టించుకోవడం లేదు. ఎంపీలను అసలు ఎవరూ ఖాతరు చేయడం లేదు. వారి ఉనికినే ఎమ్మెల్యేలు భరించలేకపోతున్నారు.
బాలశౌరి vs పేర్నినాని....
మాగుంట శ్రీనివాసరెడ్డి నుంచి బాలశౌరి వరకూ ఇదే పరిస్థితి. కొందరు ఎంపీలయితే అసలు నియోజకవర్గాల పర్యటనలే మానుకున్నారు. సీఎం పర్యటన ఉంటే వస్తున్నారు తప్పించి ఏ నియోజకవర్గానికి వెళ్లకుండా హైదరాబాద్ లోనో, ఢిల్లీలోనో కాలం వెళ్లబెచ్చుతున్నారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, మాజీ మంత్రి పేర్ని నాని ల మధ్య విభేదాలు బయపటడి పార్టీ పరువును రోడ్డున పడేశాయి. మచిలీపట్నంలో 33వ డివిజన్ లో పర్యటించేందుకు వచ్చిన ఎంపీ బాలశౌరిని వైసీపీ క్యాడర్ అడ్డుకుంది. బాలశౌరి వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది.
నియోజకవర్గాల్లోనూ....
ఇక నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాల తారాస్థాయికి చేరుకున్నాయి. విభేదాలను పరిష్కరించే దిశగా వైసీపీ అధినాయకత్వం ప్రయత్నించిన దాఖలాలు లేవు. ప్రతి నియోజకవర్గంలో ఈ గ్రూపు తగాదాలే ఒకరిని ఒకరు ఓడించుకోవడం ఖాయంగా కన్పిస్తుంది. ఇక ఎక్కడ 175 నియోజకవర్గాల్లో గెలుపు? అసలు అధికారంలోకి వస్తుందా? అన్న అనుమానాలు వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా నేరుగా జగన్ జోక్యం చేసుకుని నియోజకవర్గాల్లో నెలకొన్న నేతల మధ్య విభేదాలను పక్కన పెడితే తప్ప రెండంకెల నుంచి మూడెంకల సీట్లు రావన్నది ఆ పార్టీ క్యాడర్ బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.


Tags:    

Similar News