జగన్ మీద నమ్మకం పోయిందా?

మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలు జగన్ ప్రభుత్వాన్ని విశ్వసించడం లేదన్న కామెంట్స్ బలంగా వినపడుతున్నాయి;

Update: 2022-07-21 04:13 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రాఫ్ క్రమంగా తగ్గిపోతుందా? ప్రజలు ఆయనను విశ్వసించడం లేదా? ముఖ్యంగా మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలు జగన్ ప్రభుత్వాన్ని విశ్వసించడం లేదన్న కామెంట్స్ బలంగా వినపడుతున్నాయి. ముఖ్యంగా అర్బన్ ఏరియాల్లో జగన్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కనపడుతుంది. అందుకు సర్వేలు అవసరం లేదు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలే ఇందుకు నిదర్శనం. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లకు పెద్దగా స్పందన రాకపోవడమే ఇందుకు ఉదాహరణగా చూప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వంపై విశ్వసనీయత లేకనే ఎవరూ ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదని తెలిసింది.

మధ్యతరగతి ప్రజల కోసం...
పట్టణాల్లో మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకు అందించేందుకు జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లను నిర్మించాలని ప్రభుత్వం భావించింది. ప్రతి పట్టణంలోనూ ఈ రకమైన టౌన్ షిప్ లను ఏర్పాటు చేయాలని భావించింది. మధ్యతరగతి ప్రజల సొంతింటి ఇంటి కల సాకారామయ్యేందుకు ఈ టౌన్ షిప్ లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అందులో లే అవుట్లు వేయడమే కాకుండా అన్ని రకాలుగా వసతులు కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. అందుకోసం ఎంపిక చేసిన నగరాలలో టౌన్ షిప్ ల నిర్మాణం కోసం ప్రజల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.
కనీస స్పందన...
అయితే ఈ స్మార్ట్ టౌన్ షిప్ ల కోసం ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదని ప్రభుత్వ వర్గాల నుంచి తెలిసింది. దరఖాస్తులు అయితే వచ్చాయి తప్పించి, అందుకు తగిన సొమ్ములు ప్రజలు చెల్లించలేదని తెలిసింది. ఆన్ లైన్ దరఖాస్తుతో పాటు పది శాతం మొత్తాన్ని చెల్లించాలి. అగ్రిమెంటుకు ముందు 30 శాతం చెల్లించాలి. ఆరు నెలల తర్వాత మరో 30 శాతం, చివరిగా ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసే సమయంలో చివరిగా 30 శాతం చెల్లించాల్సి ఉంటుంది. పూర్తిగా అభివృద్ధి చేసిన ప్లాట్లను లబ్దిదారులకు కేటాయిస్తారు. అయితే ముందుగా డబ్బులు చెల్లిస్తే ప్రభుత్వం ఇతర పథకాలకు వినియోగిస్తుందన్న అనుమానమూ మధ్యతరగతి, ఉద్యోగుల్లో రావడంతోనే పెద్దగా రెస్పాన్స్ రాలేదని తెలిసింది. ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తే ఈ టౌన్ షిప్ లు అభివృద్ధి అవుతాయా? లేదా? అన్న సందేహంతోనే అనేక మంది వెనక్కు తగ్గారు.
అప్పట్లో హ్యాపీ నెస్ట్....
గతంలో చంద్రబాబు హయాంలో అమరావతి వద్ద హ్యాపీ నెస్ట్ పేరుతో ఇలాగే డబ్బులు సేకరించారు. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత హ్యాపీ నెస్ట్ ను పక్కన పడేసింది. అక్కడ ధనిక వర్గాలు, ఎన్ఆర్ఐలు ఎక్కువగా కొనుగోలు చేశారు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఎదురు కాలేదు. కానీ తాము కష్టపడి సంపాదించుకున్న డబ్బును ప్రభుత్వ పరం చేయడానికి ఇష్టపడటం లేదు. అనేక చోట్ల దరఖాస్తులు ఆహ్వానించినా పెద్దగా స్పందన రాలేదు. ఇది ప్రభుత్వంపై విశ్వసనీయత లేకపోవడమే కారణమంటున్నారు. అసలే అప్పులు చేస్తున్న సర్కార్ తమ డబ్బులను సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తే తాము ప్రభుత్వం ప్లాట్లు ఇచ్చేంత వరకూ వేచి చూడాల్సి ఉంటుందన్న కారణంతోనే ప్రజలు ఈ టౌన్ షిప్ లవైపు ఆసక్తి చూపడం లేదంటున్నారు. అందుకే వాటిని అధికారులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదన్నది అధికార వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.


Tags:    

Similar News