నాకు పిచ్చిలేదు.. హింసించకండి

విశాఖ మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు డాక్టర్ సుధాకర్‌ లేఖ రాశారు. మాస్కుల విషయం నుంచి అన్ని అంశాలను లేఖలో ఆయన పేర్కొన్నారు. సాధారణంగా ఉన్న తనకు మానసిక [more]

Update: 2020-05-27 12:36 GMT

విశాఖ మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు డాక్టర్ సుధాకర్‌ లేఖ రాశారు. మాస్కుల విషయం నుంచి అన్ని అంశాలను లేఖలో ఆయన పేర్కొన్నారు. సాధారణంగా ఉన్న తనకు మానసిక రోగికి ఇచ్చే మందులు ఇస్తున్నారని వెల్లడించారు. తనకు ఏ రోజు ఏ మందులు ఇచ్చారో లేఖలో పేర్కొన్నారు. ఈ మందుల వల్ల దుష్ప్రభావాలు వస్తున్నాయని సుధాకర్ వాపోయారు. పెదవిపై వచ్చిన మార్పులు చూపిస్తూ ఫొటోలు విడుదల చేశారు. యూరిన్‌ సమస్య కూడా ఉందని లేఖలో తెలిపారు. తనను వెంటనే వేరే ఆస్పత్రికి రిఫర్‌ చేయాలని సుధాకర్‌ విజ్ఞప్తి చేశారు. తన మానసిక స్థితి సరిగానే ఉందని లేఖలో సుధాకర్ పేర్కొన్నారు.

సుప్రీంకోర్టుకు వెళతాం….

డాక్టర్ సుధాకర్ తల్లి కవేరిబాయి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తాము చేతకాని వాళ్లం కాదని చెప్పారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుందని పేర్కొన్నారు. ఒక నక్సలైట్‌కు కూడా ఇలాంటి ట్రీట్‌మెంట్‌ ఉండదన్నారు. సుధాకర్‌ను నడిరోడ్డుపై చితకబాదారని, అసలు ఇది ప్రభుత్వమేనా? అని కవేరిబాయి ప్రశ్నించారు. కేజీహెచ్‌కు తీసుకెళ్లిన రెండు గంటల్లోనే పిచ్చి అని నిర్ధారించారని, నర్సీపట్నం ఎమ్మెల్యే కావాలనే ఇదంతా చేస్తున్నాడని ఆరోపించారు.

లేఖ ఎలా రాస్తారు?

మానసిక స్థితి బాగలేకపోతే లేఖ ఎలా రాస్తారని సుధాకర్‌ కుటుంబ సభ్యులు నిలదీశారు. దళితుల్ని అణగదొక్కేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని వారు మండిపడ్డారు. ‘‘దళితులపై చులకనభావన చూపించడం సరికాదు. మాస్క్‌లు అడిగితే పిచ్చోడని ముద్ర వేస్తారా. డాక్టర్‌ సుధాకర్‌కు ప్రాణహాని ఉంది.. వెంటనే వేరే ఆస్పత్రికి తరలించాలి. మాపై ప్రయోగాలు చేయొద్దని సీఎం జగన్‌ను వేడుకుంటున్నాం. మా కేసును వాదిస్తున్నందుకు న్యాయవాది శ్రావణ్‌కుమార్‌పై కేసులు పెట్టారు. కావాలనే సుధాకర్‌పై నాన్‌బెయిలబుల్‌ కేసు పెట్టారు. సుధాకర్‌ను కొట్టిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి’’ అని సుధాకర్‌ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News