గోనె జోస్యం వింటే ఇక అంతేనా?
గోనె ప్రకాష్ రావు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి జోస్యం చెబుతున్నారు.
గోనె ప్రకాష్ రావు తెలంగాణకు చెందిన నేత. ఏ పార్టీలో ప్రస్తుతం లేరు. ఆయన మరో లగడపాటి రాజగోపాల్ గా తయారయ్యారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఆయనను అడిగింది లేదు.. పెట్టింది లేదు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం జోస్యం చెబుతున్నారు. తాను నివాసం ఉంటున్న తెలంగాణ రాజకీయాల జోలికి మాత్రం గోనె వెళ్లడం లేదు. గోనె ప్రకాష్ రావు ఒకప్పుడు రాజకీయ అంచనాలు చెబుతుండే వారు. అలా నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆప్తుడిగా మారి ఆర్టీసీ ఛైర్మన్ పదవిని సంపాదించుకోగలిగారు.
ఆరు నెలలకే ...
గోనె ప్రకాష్‌రావు 1983లో పెద్దపల్లి నియోజకవర్గం నుండి సంజయ్‌విచార్‌మంచ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గీట్ల ముకుందారెడ్డి 6427 వేల ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన ఆరునెలలకు తన పదవికి రాజీనామా చేశాడు. అంతకు మించి ఆయన రాజకీయాల్లో రాణించింది లేదు. తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. వైఎస్ మరణం తర్వాత కొంతకాలం వైసీపీలో పనిచేశారు. అయితే రాష్ట్ర విభజన జరగడంతో ఆయన ఇప్పుడు విశ్లేషకుడి అవతారమెత్తారు.
ఏపీ పాలిటిక్స్‌లో...
కాకుంటే ఎక్కడ లేని రాజకీయాలు ఆయనకు కావాలి. ఆయనకు అక్కర లేని విషయాల్లోనూ తలదూర్చడం ఆయనకు అలవాటు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ తెలంగాణ నేతగా ఉండి తెలంగాణ రాష్ట్రం రాదని చెప్పిన నేత గోనె ప్రకాష్ రావు. ఆయన మాటలకు ఎంత విలువ ఉంటుందో అందరికీ తెలిసిందే. 2004 తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కరీంనగర్ నుంచి కేసీఆర్ గెలవరని చెప్పిన గోనె ప్రకాష్‌రావు ఆ తర్వాత రెండున్నర లక్షల మెజారిటీతో కేసీఆర్ గెలవడంతో ఆయన రాజకీయ నేతల్లో విశ్వాసాన్ని కోల్పోయారు. ప్రస్తుతం ఆయన ఆశ్రమంలో ఉంటున్నారు. అక్కడ ఉంటూనే ఏపీ రాజకీయాల్లో వేలు పెడుతున్నారు. అందులో తప్పేమీ లేదు కాని, ఎలాంటి శాస్త్రీయత లేకుండా చెప్పడమే గోనెపై సోషల్ మీడియాలో పార్టీ క్యాడర్ ఫైర్ అవుతుంది.
ఏపీ ఎన్నికలపై జోస్యం...
తాజాగా వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న లెక్కలు గోనె ప్రకాష్‌రావు చెప్పేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీదే అధికారమని తెలిపారు. జనసేన, టీడీపీకి కలిపి 150 సీట్లు వచ్చే అవకాశం ఉందని గోనె ఆశ్రమంలో కూర్చుని అంచనా వేశారు. ఒంటరిగా టీడీపీకే 100 సీట్లు వస్తాయని కూడా చెప్పారు. జగన్ రెడ్డి జైలుకు వెళ్లే అవకాశమే లేదని, జగన్ కోర్టులో కేవలం జరిమానాలు మాత్రమే కడతారంటూ మరో జోస్యం కూడా చెప్పారు. ఇటీవల మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీలోకి వెళతారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కిన గోనె తనను ఎవరూ పట్టించుకోవడం లేదని ఇలాంటి సర్వేలు చేస్తున్నారా? లేదా ఊసుపోక లెక్కలు చెబుతూ కాలం గడిపేస్తున్నారా? అన్నది కాలమే తేల్చాల్సి ఉంది. కానీ గోనె మాటలను ఎవరూ సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నది అన్ని పార్టీల నేతలు చెబుతున్న విషయం.