Allu Arjun : ఈ కుర్చీనాది.. ఈ కాలు నాది.. అంటే కుదరదు పుష్పా
పుష్ప సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిన ఘటన టాలీవుడ్ ను షేక్ చేస్తుంది
పుష్ప సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిన ఘటన టాలీవుడ్ ను షేక్ చేస్తుంది. ముఖ్యంగా ఇకపై సినీహీరోలు జనంలోకి రావడానికి ఈ ఘటన బ్రేక్ వేసిందనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్ గా ఉంది. అయితే సంథ్యా థియేటర్ ఘటన రాజకీయంగా టర్న్ తీసుకుంది. అల్లు అర్జున్ కు మద్దతుగా కొన్ని పార్టీ నేతలు, వ్యతిరేకంగా మరికొందరు గళం విప్పుతుండటంతో ఇప్పట్లో ఈ రచ్చ ఆగేలా లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ తప్పు చేశారని అధికార పార్టీ, లేదంటూ విపక్షాలు బహిరంగ ప్రకటనలు చేస్తూ, మరొక వైపు సోషల్ మీడియాలోనూ అనుకూలంగా, వ్యతిరేకంగా పోస్టులు కనిపిస్తుండటంతో ఈ ఘటన ఇంకా మరిచిపోయే పరిస్థితి కనిపించడం లేదు.
చూసీ చూడనట్లు...
అసెంబ్లీలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను చూసీ చూడనట్లు ఊరుకుంటే అల్లు అర్జున్ సరిపోయేది. కానీ అల్లు అర్జున్ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవడం మళ్లీ కెలుక్కున్నట్లయింది. నిజానికి నెల రోజులు బెయిల్ అల్లు అర్జున్ కు లభించింది. ఈ నెలరోజులు అల్లు అర్జున్ మౌనంగానే ఉండటం మంచిది. ఎందుకంటే ఏమాత్రం తాను తొందరపడి కామెంట్స్ చేసినా అది రోజురోజుకూ ఘటన తీవ్రత మరింత పెరగడమే కాకుండా డ్యామేజీ అల్లు అర్జున్ కే ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిత్వ హననం చేశారంటూ ఏకంగా ముఖ్యమంత్రి పై అల్లు అర్జున్ పరోక్షంగా కామెంట్స్ చేసినా ఈరోజు మాత్రం కాంగ్రెస్ నుంచి మంత్రులు, నేతలు విరుచుకుపడ్డారు.
పొలిటికల్ లీడర్లతో పెట్టుకుంటే...
రేవతి కుటుంబానికి ఇరవై కోట్లు నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్ మొదలయ్యాయి. అలాగే ఐకాన్ స్టార్ అయితే మాకేంటి? అన్న డైలాగులు కూడా నేతల నుంచి వినిపించాయి. రాజకీయ నేతల నోట్లో నోరు పెట్టడం కంటే పెదవి విప్పకపోవడమే మంచిదన్న సూత్రాన్ని తన మేనమామ చిరంజీవి నుంచి అల్లు అర్జున్ ఎంతైనా నేర్చుకోవాల్సి ఉంది. ఆవేపడి పొలిటికల్ లీడర్లా తాము కూడా ప్రజలకు వివరిద్దామని కుంటే అది భ్రమే అవుతుంది. ఎందుకంటే.. అల్లు ఇంటి నుంచి వినిపించే వాయిస్ ఒక్కటే అయితే.. రాజకీయాల నుంచి అనేక గొంతుల నుంచి ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. వాటిని ఆపడం ఎవరి తరమూ కాదు. ఇది తన కెరీర్ కు కొంత ఇబ్బంది కలుగుతుందని చెప్పలేం కానీ, ఆయన ఇలా మీడియా సమావేశాలు పెట్టడం మానేస్తే మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి.
పోలీసులు వీడియోలను...
కేవలం రాజకీయ నేతల నుంచి మాత్రమే కాదు ఇటు పోలీసు ఉన్నతాధికారులు కూడా రంగంలోకి దిగి అల్లు అర్జున్ కు కౌంటర్ ఇస్తున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట వీడియోలు కూడా బయటపెట్టారు. మౌనంగా ఉండటానికి మించి మరొకటి ఉండదు. లేదంటే మరో ఇరవై రోజులు ఎటైనా వెళ్లి అటు ఆటవిడుపుగా వెళ్లి సినిమా సక్సెస్ ను కుటుంబంతో కలసి ఎంజాయ్ చేసిరావడం మంచిదని అల్లు అరవింద్ కూడా చెప్పారంటే ఆయనకు ఈ విషయం తెలుసు. అందుకే ముఖ్యమంత్రి అన్నప్పటికీ దానికి మళ్లీ కౌంటర్ ఇవ్వకుండా చూసీ చూడనట్లు వదిలేస్తే దానికంటే ఉత్తమం మరొకటి ఉంటుందా? పుష్పా అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినపడుతున్నాయి.