Tirumala : తిరుమలలో నేడు తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి?

తిరుమలలో నేడు భక్తుల సంఖ్య తక్కువగానే ఉంది. సోమవారం కావడంతో తిరుమలకు పెద్దగా భక్తులు రాలేదు

Update: 2024-12-23 02:52 GMT

తిరుమలలో నేడు భక్తుల సంఖ్య తక్కువగానే ఉంది. సోమవారం కావడంతో తిరుమలకు పెద్దగా భక్తులు రాలేదు. దీంతో కంపార్ట్ మెంట్లన్నీ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. సోమవారం వర్కింగ్ డే కావడంతో ఎవరూ తిరుమలకు చేరుకోరన్నది ఎప్పటి నుంచో జరుగుతుంది. అయితే గత వారం మాత్రం సోమవారం తిరుమలలో అధిక రద్దీ ఏర్పడింది. దర్శనానికి గంటల సమయం పట్టింది. అయితే ఈరోజు మాత్రం స్వామి వారి దర్శనం సులువుగానే అవుతుండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెద్దగా క్యూ లైన్ లలో వేచి ఉండకుండానే శ్రీవారిని దర్శించుకుంటున్నారు. వచ్చిన వారు కూడా ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల ప్రజలతో పాటు ముందుగా దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకున్న వారు మాత్రమే తిరుమలకు సోమవారం వస్తున్నారు. మరికొంత మంది ఆదివారం తిరుమలకు వచ్చి రాత్రి బస చేసి సోమవారం కూడా శ్రీవారిని దర్శించుకునే వారు కూడా అధికంగా ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు తెలిపారు. ఈ నెలలో సాధారణంగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. జనవరి 1వ తేదీ నుంచి రద్దీ మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. కొత్త ఏడాదిలో స్వామివారిని దర్శించుకుందామని వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

రెండు కంపార్ట్ మెంట్లలోనే...
అందుకే డిసెంబరు నెలలో క్రిస్మస్ సెలవులు కూడా ఉండటంతో రేపటి నుంచి భక్తుల రద్దీ తిరుమలకు ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లు, భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భక్తులు త్వరగా దర్శనం చేసుకునేందుకు ప్రయోగాత్మకంగా కూడా ప్రయత్నిస్తామని చెబుతున్నారు. ఈరోజు తిరుమలలోని రెండు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు రెండు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 77,260 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,223 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.12 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.




ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

 


Tags:    

Similar News