సర్వేలు భయపెడుతున్నాయా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను అంతర్గత సర్వేలు భయపెడుతున్నట్లే కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను అంతర్గత సర్వేలు భయపెడుతున్నట్లే కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో వస్తున్న నివేదికలు ఆయనను ఆలోచనల్లో పడేస్తున్నాయి. ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతో పాటు కొన్ని వర్గాల్లో ప్రభుత్వంపై కూడా వ్యతిరేకత కనపడుతుంది. దీంతో ఆయన వరసగా ఎమ్మెల్యేలకు క్లాస్ పీకేందుకు రెడీ అవుతున్నట్లే కన్పిస్తుంది. మరోసారి జగన్ గడప గడపకు ప్రభుత్వంపై ఈరోజు వర్క్ షాపు పెడుతున్నారు. అందులో ఎమ్మెల్యేలను ప్రజల వద్ద ప్రస్తావించాల్సిన అంశాలు, సమస్యల పరిష్కారం పై ప్రజలకు భరోసా ఇవ్వడంపై ఈ వర్క్ షాప్ లో ప్రధానంగా చర్చించే అవకాశాలున్నాయి.
సానుకూలత లేక...
2024 ఎన్నికల కోసం ఐ ప్యాక్ టీం ఇప్పటికే రెండు మూడు దఫాలుగా ఆంధ్రప్రదేశ్ లో సర్వేలు నిర్వహించింది. రుషిరాజ్ సింగ్ ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్న తర్వాత మరోసారి సర్వే చేసినట్లు కనపడుతుంది. ఈ సర్వే ఫలితాలు అంత సానుకూలంగా లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు సక్రమంగానే ఉన్నా, ప్రభుత్వంపై సానుకూలత లేకపోవడం, స్థానిక ఎమ్మెల్యేల్లో అధికశాతం మందిపై వ్యతిరేకత కనిపించడంతోనే మరోసారి వర్క్ షాప్ పేరిట జగన్ ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
క్యాడర్ లో ....
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్న జగన్ అన్ని వర్గాల మద్దతును సంపాదించే ప్రయత్నాన్ని ప్రారంభించారు. ఈ రెండేళ్లలో వ్యతిరేకత ఉన్న వర్గాలపై దృష్టి సారించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా వేగవంతం చేయాలని నిర్ణయించారు. ప్లీనరీ సక్సెస్ కావడంతో క్యాడర్ లో కొంత ఉత్సాహం పెరిగింది. పార్టీ పరంగా కొన్ని సమస్యలున్నా ప్రభుత్వ పరంగా అత్యధికంగా ప్రజల్లో అసంతృప్తి ఉందని సర్వేల ద్వారా వెల్లడవుతుండటంతో ఎమ్మెల్యేలను ప్రజలకు మరింత చేరువ చేర్చే ప్రయత్నంలో జగన్ ఉన్నట్లు కనపడుతుంది.
ఈసారి సీరియస్ గానే...
అసలు గడప గడపకు ప్రభుత్వం పెట్టడంలో ఉద్దేశ్యమూ అదే. ఎమ్మెల్యేలు ఎక్కువ మంది నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో అసహనం పెరుగుతోంది. రెండేళ్ల పాటు కరోనా కారణంగా ప్రజలకు దూరమయ్యారు. కరోనా తగ్గిన తర్వాత కూడా కొందరు ఎమ్మెల్యేలు వ్యాపారాలకే పరిమితమయ్యారు. తొలిసారి నిర్వహించిన వర్క్ షాపులో కొందరికి జగన్ వార్నింగ్ పరోక్షంగా, మరికొందరికి నేరుగా వార్నింగ్ ఇచ్చారు. ఈసారి కూడా మరికొందరు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నివేదికలను బయటపెట్టనున్నారని తెలిసింది. సర్వేల్లో నెగిటివ్ వచ్చిన వారికి కొంత స్ట్రాంగ్ గానే జగన్ ఈ వర్క్ షాపులో వార్నింగ్ ఇవ్వనున్నారని చెబుతున్నారు. మొత్తం మీద జగన్ ను వరసగా వెల్లడవుతున్న సర్వేలు భయపెడుతున్నట్లే కనిపిస్తున్నాయి.