ఆదిత్య.. లోకేష్... పార్టీని మింగేస్తారా?
వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచినా లోకేష్ నాయకత్వంలోనే పనిచేయాల్సి ఉంటుందన్నది కాదనలేని వాస్తవం
మహారాష్ట్ర రాజకీయాలను చూశాం. ఐదు దశాబ్దాల శివసేన నిట్టనిలువుగా చీలిపోయింది. థాక్రే కుటుంబానికి వ్యతిరేకంగా శివసేన ఎమ్మెల్యేలు షిండే శిబిరానికి క్యూ కడుతున్నారు. కుటుంబ పార్టీలు వాటంతట అవే పతనాన్ని కొని తెచ్చి పెట్టుకుంటాయన్నది శివసేన ను చూస్తే అర్థమవుతుంది. ప్రతి ప్రాంతీయ పార్టీలో ఇదే రకమైన ధోరణి కన్పిస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనూ అదే రకమైన చర్చ జరుగుతుంది.
బాబు నాయకత్వంపై....
చంద్రబాబు నాయకత్వం ఉన్నంత వరకూ ఆ పార్టీకి ఎటువంటి ఢోకా లేదు. మూడు దశాబ్దాల నుంచి ఆయన పార్టీని సమర్థవంతంగా నడపగలిగారు. పార్టీని అధికారంలోకి తెచ్చారు. ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా నేతలు ఆయనపై పూర్తి నమ్మకాన్ని ఉంచారు. కానీ మహారాష్ట్రలో శివసేన తరహాలోనే తెలుగుదేశం పార్టీకి ఇక్కడ అలాంటి పరిస్థితులు భవిష్యత్ లో ఎదురవుతాయన్న విశ్లేషణలు బలంగా విన్పిస్తున్నాయి.
ఆదిత్య ధోరణితోనే...
శివసేనలో ఆదిత్య ఠాక్రే వైఖరి వల్లనే ప్రస్తుత సంక్షోభం ఏర్పడిందన్నది వాస్తవం. వివిధ శాఖల్లో నేరుగా జోక్యం చేసుకున్నందునే మంత్రులతోసహా అందరూ ఉద్ధవ్ కు వ్యతిరేకమయ్యారు. ఉద్ధవ్ పై సదభిప్రాయం ఉన్నా ఆదిత్య థాక్రే పోకడ వల్లనే అక్కడ పుట్టిమునిగింది. టీడీపీలో కూడా అదే పరిస్థిితి వస్తుందన్నది రాజకీయ విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు తన వారసుడు లోకేష్ కు మంత్రి పదవి ఇచ్చి మరీ కోరి కష్టం తెచ్చుకున్నారంటున్నారు. నాడు లోకేష్ పెత్తనానికి సీనియర్ మంత్రులే చికాకు పడ్డారు. యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి లే లోకేష్ వల్ల ఇబ్బంది పడ్డారు.
టీడీపీ అధికారంలోకి వచ్చినా...
అందుకే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచినా లోకేష్ నాయకత్వంలోనే పనిచేయాల్సి ఉంటుందన్నది కాదనలేని వాస్తవం. అందుకే చంద్రబాబు సీనియర్ నేతలను దూరం పెడుతున్నారు. యువ నేతలను ప్రోత్సహిస్తున్నారు. ఈసారి నలభై శాతం కంటే ఎక్కువగా యువతకే ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నారు. లోకేష్ ఇంకా నాయకుడిగా ఎదగలేదు. ఆయనను నమ్మి రాజకీయాలు చేయడానికి ిఇంకా కొందరు సిద్దపడటం లేదు. కానీ చంద్రబాబు అనుకూల మీడియా మాత్రం లోకేష్ ను నాయకుడిగా చూపేందుకు అష్టకష్టాలు పడుతుంది. టీడీపీకి మైనస్ పాయింట్ చినబాబు అన్నది సీనియర్ నేతల అభిప్రాయం. ఒకవేళ అధికారంలోకి వస్తే చంద్రబాబు మాత్రం కుటుంబ వత్తిడులకు తలొగ్గి లోకేష్ కు ప్రభుత్వంలో, పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించడం ఖాయం. అదే ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది.