ఈసారి "సింగిల్" గానేనట
పవన్ కల్యాణ్ ఈసారి ఒంటరిగా పోటీ చేసేందుకు కూడా అన్ని విధాలుగా రెడీ అవుతున్నారని తెలిసింది;
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను నిజంగా అభినందించాల్సిందే. సహజంగా పార్టీ పెట్టి ఎనిమిదేళ్లు దాటుతున్నా, గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టంగా లేకపోయినా పరవాలేదు. ఆయన పార్టీ స్థాపించిన ఆశయాలను పక్కన పెట్టినా ఆశ మాత్రం ఎప్పుడూ వదులుకోరు. గత ఎన్నికల్లో ఒక స్థానంలోనే జనసేన గెలవడం, తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో పోటీ చేసి ఓటమి పాలయినా 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి తానే అవుతారనుకుంటున్నారు. అందులో తప్పులేదు. రాజకీయాల్లో ఇలాంటి నేతలు చాలా అరుదుగా కన్పిస్తారు.
రోడ్డు మ్యాప్ కోసం...
సినిమా ఫ్లాప్ అయినప్పుడు కుంగిపోకుండా, మరో సినిమా హిట్ కోసం ఎదురు చూసినట్లు వచ్చే ఎన్నికల్లో గెలుపు దక్కుతుందని ఆశించడంలో ఏ మాత్రం తప్పులేదు. బీజేపీ పై పవన్ ఇక ఆశలు వదులుకున్నట్లే కన్పిస్తుంది. దాదాపు ఐదు నెలల క్రితం బీజేపీ కేంద్రం పెద్దల నుంచి రోడ్డు మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఇంతవరకూ రోడ్డు మ్యాప్ కాదు కదా.. ఎటువంటి సంకేతాలను బీజేపీ కేంద్ర నాయకత్వం పంపలేదు.
బీజేపీకి దూరం..
ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారానికి కూడా పవన్ కల్యాణ్ దూరంగా ఉన్నారు. రాష్ట్ర నేతలతో కాదు తనకు కేంద్రం పెద్దలతో సంబంధాలున్నాయన్న పవన్ కల్యాణ మోదీ ఏపీకి వచ్చినా కనీసం కలిసే ప్రయత్నం చేయలేదు. భీమవరం సభకు కూడా దూరంగా ఉన్నారు. బీజేపీతో ఆయన తెగదెంపులు చేసుకోవడానికి ఆయన రెడీ అయిపోతున్నారు. బీజేపీ మాత్రం పవన్ కల్యాణ్ తో కలసి నడవాలని కోరుకుంటుంది. మహారాష్ట్రలో షిండేకు అవకాశం ఇచ్చినట్లుగానే పవన్ కల్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వరన్న ప్రశ్న బీజేపీ నేతలు కొందరు ప్రశ్నిస్తున్నారు.
టీడీపీ అంగీకరించకుంటే...
కానీ అదే సమయంలో పవన్ కల్యాణ్ తన ధైర్యాన్ని కోల్పోదలుచుకోలేదు. ఆయన ఈసారి ఒంటరిగా పోటీ చేసేందుకు కూడా అన్ని విధాలుగా రెడీ అవుతున్నారని తెలిసింది. ఆయనకు 2024 ఎన్నికల్లో ఫలితాలు ఎలా వచ్చినా పరవాలేదు. 2029 ఎన్నికల నాటికి తాను టీడీపీ ప్లేస్ లోకి వస్తానన్న నమ్మకంతో ఉన్నారు. అందుకే పవన్ కల్యాణ్ స్ట్రాటజీ ఈసారి వేరేగా ఉంటుందంటున్నారు. సింగిల్ గానే వచ్చి సీట్లు వచ్చినా.. రాకపోయినా ఓట్ల శాతం పెంచుకునే ఉద్దేశ్యంతోనే పవన్ ఉన్నారు. టీడీపీ కొంత దిగి వచ్చి తమ ఆశలకు అనుగుణంగా తలొగ్గితే చెప్పలేం తప్ప.. పవన్ మాత్రం సింగిల్ గానే పోరాటానికి సిద్ధమవుతున్నారు.