కోకాకోలా, పెప్సీలకు పోటీగా కంపా కోలా.. కొనుగోలు చేసిన రిలయన్స్

తాజాగా రిలయన్స్ సంస్థ ఢిల్లీ ప్యూర్ డ్రింక్స్ కంపెనీకి చెందిన కంపాకోలా, సోస్యో సాఫ్ట్ డింక్స్ బ్రాండ్లను కొనుగోలు చేసింది.

Update: 2022-08-31 13:24 GMT

భారత్ లో కూల్ డ్రింక్స్ లవర్స్ ఎక్కువే. వర్షాకాలం వచ్చినా.. చాలా ప్రాంతాల్లో ఎండలు దంచుతుండటంతో.. దాహార్తిని తీర్చుకునేందుకు కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. కొందరైతే ఎండ, వాన, చలి కాలాలతో సంబంధం లేకుండా కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. పెళ్లైనా.. పండుగైనా, ఫంక్షనైనా.. అక్కడ కూల్ డ్రింక్స్ ఉండటం కామనైపోయింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కూల్ డింక్స్ కు పోటీగా మరో బ్రాండ్ కూల్ డ్రింక్స్ రానున్నాయి. కోకాకోలా, పెప్సీ, స్పైట్, థంబ్స్ అప్ ప్రస్తుతం మార్కెట్లో గట్టిపోటీ ఇస్తున్నాయి.

తాజాగా రిలయన్స్ సంస్థ ఢిల్లీ ప్యూర్ డ్రింక్స్ కంపెనీకి చెందిన కంపాకోలా, సోస్యో సాఫ్ట్ డింక్స్ బ్రాండ్లను కొనుగోలు చేసింది. ఎఫ్ఎంసీజీ రంగంలోకి ప్రవేశిస్తామని ముఖేశ్ అంబానీ ప్రకటించిన రెండు రోజుల్లోనే దీనికి సంబంధించి కీలక అడుగు పడటం గమనార్హం. ఎఫ్‌ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) అంటే మనంరోజూ తప్పనిసరిగా ఉపయోగించే నిత్యావసరాలని అర్థం. టూత్ పేస్టులు, సబ్బుల నుంచి కూల్ డ్రింక్స్ వరకూ అన్నీ ఎఫ్ఎంసీజీ వస్తువుల పరిధిలోకే వస్తాయి. ఇప్పటివరకూ రిలయన్స్ ఇతర సంస్థల నుంచి సామాగ్రిని కొనుగోలు చేసి తమ సూపర్ మార్కెట్లలో విక్రయిస్తోంది. ఇకపై స్వయంగా నిత్యావసరాలను తయారు చేయనుంది. ప్రస్తుతం హిందుస్థాన్‌ యూనిలీవర్‌, నెస్లే, బ్రిటానియా కంపెనీలు అగ్రగామిగా ఉన్నాయి. ఇప్పుడీ రంగంలోకి రిలయన్స్ దిగుతుండటంపై ఆసక్తి నెలకొంది.
30 ఏళ్ల క్రితం ఆదరణ పొందిన కంపా కూల్ డ్రింక్స్ ను రిలయన్స్ ఈ ఏడాది దీపావళి నాటికి రీ లాంచ్ చేయాలని భావిస్తున్నట్లు ఆ సంస్థ వర్గాలు వెల్లడించాయి. అప్పట్లో థమ్స్‌ అప్‌, గోల్డ్‌ స్పాట్‌, లిమ్కాలతో కంపా కూల్ డ్రింక్ ల మధ్య గట్టిపోటీ ఉండేది. వినియోగదారులు కోకాకోలా, పార్లే బ్రాండ్లను ఎక్కువగా కొనుగోలు చేయడంతో కంపా కూల్ డ్రింక్స్ వెనుకబడిపోయాయి. ఇప్పుడు రిలయన్స్ ద్వారా ఇవి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.



Tags:    

Similar News