రేవంత్ మరోసారి టార్గెట్.. తప్పదా?

రేవంత్ రెడ్డి ఏ నిమిషాన పీసీసీ చీప్ అయ్యారో కాని అన్నీ సమస్యలే. ప్రతి ఒక్కరూ రేవంత్ ను టార్గెట్ గా చేసుకుంటున్నారు

Update: 2022-08-12 08:40 GMT

రేవంత్ రెడ్డి ఏ నిమిషాన పీసీసీ చీప్ అయ్యారో కాని అన్నీ సమస్యలే. ప్రతి ఒక్కరూ రేవంత్ ను టార్గెట్ గా చేసుకుని బయటకు వెళ్లిపోతున్నారు. పార్టీని విడిచి పెట్టే ప్రతి నేత రేవంత్ పై విమర్శలు చేస్తున్నారు. దీంతో పాటుగా ఉప ఎన్నికలు కూడా రేవంత్ రెడ్డికి సవాల్ గా మారాయి. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలా క్రమశిక్షణ కలిగిన పార్టీ కాదు. టీడీపీలో కేవలం అధినేతకే జవాబు చెప్పుకోవాలి. కానీ కాంగ్రెస్ లో అలా కాదు. ఢిల్లీ నుంచి గల్లీ లీడర్ దాకా కనిపెట్టుకుని ఉండాలి. వారి ఆశీస్సులు పొందేందుకే నిత్యం ప్రయత్నించాలి. పార్టీ పురోగతిని పక్కన పెట్టి నేతలను దువ్వడమే పీసీసీ చీఫ్ కు పెద్ద పనిగా మారింది. ఏడాది నుంచి ఇదే తంతు. ఈరోజు రేవంత్ రెడ్డిపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. తనకు క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబడుతున్నారు.

బలం లేని నేతల...
ప్రజల్లో బలం లేని నేతలు కూడా బెదిరింపులకు దిగుతారు. వారికి హైకమాండ్ అండదండలు ఉండటంతో గాంధీభవన్ లో మాత్రం వారికి రాచమర్యాదలు చేయాల్సిందే. జనంలో పరపతి లేకపోయినా తిరుపతి వెంకన్న లాగా నేతలకు మొక్కుతుండాల్సిందే. కాదంటే ఒక ప్రెస్‌మీట్ పెట్టి చెడామడా తిట్టేస్తారు. సీనియర్ నేతలు కావడంతో వారిపై చర్యలుండవు. మహా అయితే ఒక షోకాజ్ నోటీసు జారీ అవుతుంది. అంతే తప్ప పీసీసీ చీఫ్ అంటే ఎవరికి గౌరవం లేదు. భయం లేదు. పార్టీని బలోపేతం చేయడాన్ని పక్కన పెట్టి తప్పులు ఎక్కడ దొరుకుతాయా? అన్న అన్వేషణలోనే అనేక మంది నేతలుంటారు. రేవంత్ రెడ్డికి కూడా ఈ బాధలు తప్పడం లేదు.
వెళ్లే వాళ్లంతా...
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నుంచి దాసోజు శ్రవణ్ వరకూ అంతే. వారు ముందుగానే పార్టీ వీడాలని నిర్ణయించుకుంటారు. వెళుతూ వెళుతూ బురదచల్లి వెళుతుంటారు. ఇక వీహెచ్ లాంటి నేతలయితే నేరుగానే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ తమకంటే రేవంత్ బుడ్డోడు అన్న కలరింగ్ ఇచ్చేస్తుంటారు. ఇక గతంలో జరిగిన హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి దారుణం. చివరి నిమిషంలో అభ్యర్థిని ఎంపిక చేశారన్న విమర్శలు రేవంత్ ఎదుర్కొనాల్సి వచ్చింది. చివరకు ఆ ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కలేదు. దాని ఫలితాన్ని రేవంత్ రెడ్డి ఆరు నెలలపాటు భరించాల్సి వచ్చింది. అక్కడ ఇన్‌ఛార్జులను, పార్టీకి ప్రచారం చేసిన వారిని వదిలేసి రేవంత్ ను టార్గెట్ గా చేసుకుని సొంత పార్టీ నేతలే ఫిర్యాదు చేశారు.
గత ఎన్నికల్లోనూ...
అదే సమయంలో బద్వేలు లో జరిగిన ఉప ఎన్నికలో వచ్చిన ఓట్లు కూడా హుజూరాబాద్ లో రాలేదంటూ కస్సుమన్నారు. రేవంత్ పదవిని వెంటనే పీకి పారేయాలని కోరారు. అది ఎలాగోలా సద్దుమణిగింది. మళ్లీ మునుగోడు ఉప ఎన్నిక వస్తుంది. ఈ ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపిక కోసం కమిటీని వేశారు. పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ నుంచి నల్లగొండ జిల్లా నేతల వరకూ దీనిపై కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థి ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు కానీ, రేపు మునుగోడు ఉప ఎన్నిక ఫలితం అటూ ఇటూ అయితే మాత్రం అందుకు కారణం రేవంత్ అవుతాడు. ప్రచారకమిటీ, వ్యూహకమిటీ, అగ్రనేతలు ఎవరినీ పట్టించుకోరు. మరోసారి మునుగోడు ఉప ఎన్నిక రేవంత్ రెడ్డికి పరీక్ష అనే చెప్పాలి.
ఇది మూడో ఎన్నిక....
మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్ సీటు. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో హుజూర్‌నగర్ సిట్టింగ్ స్థానాన్ని కూడా కాంగ్రెస్ కోల్పోయింది. నాగార్జునసాగర్ సిట్టింగ్ స్థానం కాకపోయినా కాంగ్రెస్ కు బలం ఉన్న నియోజకవర్గం. సీనియర్ నేత జానారెడ్డి పోటీ చేసినా ఫలితం దక్కలేదు. నల్లగొండ జిల్లాలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పరాజయం పాలయింది. మళ్లీ అదే నల్లగొండ జిల్లాలో మునుగోడు ఉప ఎన్నిక జరగబోతుంది. మునుగోడులో ఎన్నిక ప్రచారానికి జాతీయ రాజకీయ నేతలు ఎవరూ హాజరు కారు. టిక్కెట్ల కోసం పోటీ మాత్రం ఉంటుంది. కానీ ఒక్క ఓటు సంపాదించడానికి మాత్రం కష్టపడరు. ఇదీ కాంగ్రెస్ తీరు. మరి దీని నుంచి రేవంత్ రెడ్డి ఎలా బయటపడతారో అన్నది చూడాలి.


Tags:    

Similar News