ఆ కాంబినేషన్ ఖచ్చితంగా గెలిపిస్తుందట.. అందుకే పోటీ

చిత్తూరు నియోజకవర్గంపై టీడీపీ నేతలు భారీ ఆశలు పెట్టుకున్నారు. గెలుస్తామన్న నమ్మకంతో ఇన్ ఛార్జి పదవికి పోటీ పడుతున్నారు

Update: 2021-11-29 04:26 GMT

చిత్తూరు నియోజకవర్గంపై టీడీపీ నేతలు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈసారి తాము గెలుస్తామన్న నమ్మకంతో ఇన్ ఛార్జి పదవి కోసం పోటీ పడుతున్నారు. కానీ పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం దీనిపై ఎటువంటి నిర్ణయం ఇప్పటి వరకూ తీసుకోలేదు. చిత్తూరు నియోజకవర్గంలో టీడీపీ ఇన్ ఛార్జి పదవి కోసం అనేక మంది ప్రయత్నిస్తున్నారు. చివరకు చంద్రగిరి ఇన్ ఛార్జిగా ఉన్న పులవర్తి నాని కూడా తీవ్రంగా ప్రయత్నిస్తుండటం గమనార్హం.

సొంత జిల్లా కావడంతో....
పార్టీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు కావడంతో ఈసారి అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. గత ఎన్నికల్లో ఒక్క కుప్పం మినహా ఎక్కడా చిత్తూరు జిల్లాలో టీడీపీ గెలవలేకపోయింది. చిత్తూరు నియోజకవర్గం కొంత టీడీపీకి అనుకూలంగానే ఉంటుంది. ఇక్కడ కమ్మ, బలిజ సామాజికవర్గాల ఆధిపత్యం ఎక్కువ. ఈసారి టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే సులువగా గెలవవచ్చన్న అంచనాతో అనేక మంది ఇక్కడ టీడీపీ ఇన్ ఛార్జి పదవి కోసం పోటీ పడుతున్నారు.
ఆ కాంబినేషన్ తో....
1983, 2004, 2014లో చిత్తూరు నియోజకవర్గంలో గెలుస్తూ వస్తుంది. అంటే పదేళ్ల తర్వాత కాని టీడీపీికి గెలుపు సాధ్యం కాలేదు. 2014లో గెలవడానికి కూడా జనసేన, టీడీపీ కాంబినేషన్ అని నమ్ముతున్నారు. దీంతో ఒక్కసారిగా చిత్తూరు నియోజకవర్గంపై టీడీపీ నేతల కన్ను పడింది. ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా ఉన్న డీకే సత్య ప్రభ మృతి చెందడంతో ఇప్పడు ఆ ఫ్యామిలీకి ఇన్ ఛార్జి పదవి ఇచ్చే అవకాశం లేదు.
పోటీలో వీరు....
గత ఎన్నికలలో పోటీ చేసిన మనోహర్ యాక్టివ్ గా లేకపోవడంతో కొత్త ఇన్ ఛార్జిని నియమించాల్సి ఉంది. ఇందుకోసం చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారు. ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు వెళ్లినప్పుడు కూడా చిత్తూరు ఇన్ ఛార్జి పదవి చర్చకు వచ్చింది. బలిజ సామాజికవర్గం నుంచి కాజూరు బాలాజీ, కటారి హేమలత పోటీపడుతున్నారు. కమ్మ సామాజికవర్గం నుంచి పులవర్తి నాని, గురజాల మహదేవ సందీపలు ప్రయత్నిస్తున్నారు. మరి చంద్రబాబు ఎవరిని ఇన్ ఛార్జి పదవికి ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పోటీ మాత్రం తీవ్రంగా ఉంది.


Tags:    

Similar News