పొత్తులకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు సభలో ఒక స్పష్టత అయితే ఇచ్చారు. ఈసారి సింగిల్ గా వెళ్లడం లేదని చెప్పకనే చెప్పారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు సభలో ఒక స్పష్టత అయితే ఇచ్చారు. ఈసారి సింగిల్ గా వెళ్లడం లేదని చెప్పకనే చెప్పారు. తాను పొత్తులతోనే ముందుకు వెళతానని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ సింగిల్ గానే ఎన్నికల బరిలోకి దిగిన కేసీఆర్ ఈసారి మాత్రం పొత్తులు తప్పవని తెలిపారు. తెలంగాణలో ఎనిమిదేళ్ల నుంచి అధికారంలో ఉండటంతో సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత కొంత ఉంటుంది. అంతేకాదు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా చీలకుండా చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే గెలుపు లభిస్తుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో సీపీఐ టీఆర్ఎస్ కు మద్దతిచ్చింది. సీపీఎం విషయం మాత్రం తేలాల్సి ఉంది. ఇంకా ఆ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
వచ్చే సాధారణ ఎన్నికలు...
మునుగోడు ఉప ఎన్నికను పక్కన పెడితే వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికలు టీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకం. కాంగ్రెస్ బలహీనంగా మారిపోయింది. బీజేపీ కొంత పుంజుకుంటోంది. అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే కేసీఆర్ టార్గెట్ చేశారు. జాతీయ పార్టీ ఆలోచనను పక్కన పెట్టి తెలంగాణపైనే ఎక్కువ దృష్టి పెట్టడం మంచిదని కేసీఆర్ భావిస్తున్నారు. మునుగోడు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన వెంటనే దానిని స్పీకర్ ఆమోదించారు. దీని వెనక కూడా కేసీఆర్ వ్యూహం దాగి ఉందంటున్నారు.
అందుకే సై అన్నారా?
ఉప ఎన్నిక వస్తే సాధారణ ఎన్నికల ముందు బీజేపీ మెడలు వంచే ప్రయత్నం చేయవచ్చు. దాని దూకుడుకు అడ్డుకట్ట వేయవచ్చు. పైగా మునుగోడులో బీజేపీ పెద్దగా బలం లేదు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. వారికి సరైన అభ్యర్థి కూడా దొరకరన్న అంచనాతోనే ఉప ఎన్నికలకు సై అనేశారు. తెలంగాణలో కమ్యునిస్టులు కొన్ని ప్రాంతాల్లో ప్రభావితం చూపించగలరు. ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో కమ్యునిస్టుల పార్టీలకు కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికీ కొంత ఓటు బ్యాంకు ఉంది. తాను బీజేపీని తీవ్రంగా విభేదించడంతో వారు ఆటోమేటిక్ గా తనతోనే కలసి వస్తారన్న కేసీఆర్ అంచనా నిజమైందనే చెప్పాలి.
మరో మార్గం లేకనే....
కమ్యునిస్టులకు వేరే మార్గం లేదు. ఇప్పటికే తెలంగాణ శాసనసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కాంగ్రెస్ తో జత కడితే ప్రయోజనం ఉండదు. ఆ పార్టీకే దిక్కులేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేసీఆర్ వెంటే నడవడం మంచిదని కమ్యునిస్టులు సయితం భావిస్తారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా సీపీఐ ఒక అడుగు ముందుకేసి టీఆర్ఎస్ కు మద్దతు తెలిపింది. సీపీఎం కూడా టీఆర్ఎస్ వెనక నడవక మానదు. అందుకే కేసీఆర్ రెండు వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఒకటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలక పోవడం, రెండు కొన్ని నియోజకవర్గాల్లో కమ్యునిస్టుల సహకారంతో బలం పెంచుకోవడమే లక్ష్యంతో ఆయన ముందుకు వెళ్లనున్నారు.