జగన్ కు మరో ఛాన్స్ ఇవ్వకూడదట

తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని జనసేన ప్రయత్నిస్తుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది.

Update: 2021-11-22 02:31 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏడుపు జనసేన పార్టీని ఆలోచనలో పడేసింది. వైసీపీిని ఎదుర్కొనాలంటే బీజేపీతో ఉండి సాధించేదేమీ లేదని, టీడీపీతో పొత్తుతో ముందుకు వెళ్లాలని ఈ ఘటన తర్వాత మరింత స్ట్రాంగ్ అయినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని జనసేన ప్రయత్నిస్తుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని చోట్ల రెండు పార్టీల మధ్య పొత్తులు కుదిరాయి.

అవగాహన....
పార్టీ అధినేతలకు ఈ పొత్తులకు ఏమాత్రం సంబంధం లేదని, స్థానిక నాయకత్వమే నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నా, అగ్రనేతలకు చెప్పిన తర్వాతనే కొన్ని చోట్ల పొత్తులు ఖరారయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోట ీచేసిన చోట జనసేన పోటీ చేయలేదు. జనసేన బరిలో ఉన్న స్థానంలో టీడీపీ పోటీకి దూరంగా ఉంది. క్రమంగా రెండు పార్టీల మధ్య అవగాహన పెరుగుతుందనే చెప్పాలి.
మీడియా సహకారం....
పవన్ కల్యాణ్ కు సొంత మీడియా లేదు. అలాగే బీజేపీకి కూడా. వచ్చే ఎన్నికల్లో కనీస స్థానాలను గెలిచి శాసనసభలో ముఖ్యపాత్ర పోషించాలంటే టీడీపీతో పొత్తు అవసరం. అలాగయితే ఒకవర్గం మీడియా నుంచి కూడా పవన్ కల్యాణ్ కు సహకారం లభిస్తుంది. ఇప్పటికే ఒకవర్గం మీడియా పవన్ కల్యాణ్ కు అండగానే ఉంటుంది. ఇక చంద్రబాబుపై అసెంబ్లీలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలతో కొంత సానుభూతి వచ్చిందని అంచనా వేస్తుంది.
వైసీపీని నిలువరించాలంటే?
అందుకే చంద్రబాబు పై మాటల దాడిని పవన్ కల్యాణ్ వెంటనే ఖండించారు. బీజేపీ నుంచి రెస్పాన్స్ కొద్దిగానే వచ్చింది. వైసీపీ మరోసారి గెలిస్తే ఏపీ మరింత అరాచకంగా తయారవుతుందని పవన్ కల్యాణ్ ఈ ఘటన తర్వాత తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అందుకే ఈసారి వైసీపీిని నిలువరించేలా ఎత్తుగడలు ఉండాలని పవన్ భావిస్తున్నారు. టీడీపీకి మరింత దగ్గరయ్యేందుకు చంద్రబాబు ఏడుపు పవన్ ను లోతుగా ఆలోచించేలా చేసింది.


Tags:    

Similar News